Begin typing your search above and press return to search.

చిచ్చుపెట్టిన కరోనా: కేసీఆర్ వర్సెస్ గవర్నర్?

By:  Tupaki Desk   |   7 July 2020 7:50 AM GMT
చిచ్చుపెట్టిన కరోనా: కేసీఆర్ వర్సెస్ గవర్నర్?
X
కరోనా.. ఒక్క తెలంగాణ సమస్యే కాదు.. యావత్ ప్రపంచానికి.. మందే లేని ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడమే మన కర్తవ్యం. అయితే తెలంగాణ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. గాంధీలో సరైన వైద్యం అందడం లేదని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అది గవర్నర్ తమిళ్ సై వరకూ చేరింది.

చాలా మంది నెటిజన్లు కరోనా విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సోషల్ మీడియా ద్వారా గవర్నర్ తమిళసైకి ఫిర్యాదు చేశారు. అయితే గవర్నర్ అధికారాలు పరిపాలన వ్యవస్థలో చాలా పరిమితంగా ఉంటాయి. విశేషాధికారాలు పాలక ప్రభుత్వాలకే ఉంటాయి. అయితే కరోనా ఫిర్యాదులపై గవర్నర్ తమిళ్ సై తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే సరిపోతుందని.. గవర్నర్ గా ఆ బాధ్యతల వరకే పరిమితమై పోయి ఉంటే బాగుండేదని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.

కానీ కేసీఆర్ సర్కార్ వైద్యం విషయంలో నిర్లక్ష్యంపై స్వయంగా గవర్నర్ తమిళ్ సై రంగంలోకి దిగారు. ప్రభుత్వ పాలనను చేతుల్లోకి తీసుకున్నారు. కరోనాపై చర్చించేందుకు ఏకంగా సమీక్ష తలపెట్టారు. సీఎస్, హెల్త్ కార్యదర్శిని సమీక్షకు రమ్మన్నారు.

అసలే హైదరాబాద్ లో కేసీఆర్ లేరు. ఇలాంటి సమయంలో పాలనను గవర్నర్ తమిళ్ సై చేజిక్కించుకోవడం.. గవర్నర్ సమీక్ష నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనతో కేసీఆర్ సర్కార్ అలెర్ట్ అయ్యింది.

గవర్నర్ తలపెట్టిన సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరు కాకుండా అడ్డుకుంది. వీరిద్దరూ గవర్నర్ సమీక్షకు గైర్హాజరు కావడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజ్ భవన్ పిలుపునిచ్చినా తాము ముందే నిర్ధేశించుకున్న ఇతర సమావేశాల్లో బిజిగా ఉన్నందున హాజరు కాలేమని సీఎస్, హెల్త్ కార్యదర్శి.. గవర్నర్ కు సమాచరమిచ్చారు. దీంతో గవర్నర్ అధికారాలు తీసుకోవాలని చూసిన ప్రయత్నాలకు కేసీఆర్ చెక్ పెట్టారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ లో అధికారులు ఇబ్బందుల్లో పడుతున్నారు. అయితే విశేష అధికారాలున్న సీఎం కేసీఆర్ వెంటే అధికారులు నడుస్తున్నారు.

కాగా ఈరోజు కరోనా చికిత్సల్లో దోపిడీపై ప్రైవేట్ ఆస్పత్రులతో గవర్నర్ భేటి కానున్నారు. ఇలా తెలంగాణలో వైద్యఆరోగ్యంపై డైరెక్టుగా గవర్నర్ తమిళ్ సై జోక్యం చేసుకోవడం.. కేసీఆర్ సర్కార్ ను ఇరుకునపెడుతోంది. తమను డమ్మీని చేయాలనుకుంటున్న గవర్నర్ తీరుపై కేసీఆర్ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.