Begin typing your search above and press return to search.

ఆ దేశంలో టీకా వేశాక.. పాజిటివ్ కేసులు పెరిగాయా?

By:  Tupaki Desk   |   12 May 2021 7:30 AM GMT
ఆ దేశంలో టీకా వేశాక.. పాజిటివ్ కేసులు పెరిగాయా?
X
పాజిటివ్ కేసుల పెరుగుదలకు చెక్ పెడుతుందని భావిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన ఇప్పుడో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. ప్రపంచంలో చాలా దేశాల్లో లేని విధంగా తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్ లో సిత్రమైన పరిస్థితి నెలకొంది. దాదాపు 115 ద్వీపాల దేశంగా పేర్కొనే ఈ ఈస్ట్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ పంపిణీ చేపట్టారు. తాజాగా చెబుతున్న లెక్కల ప్రకారం వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా 57 శాతం వరకు పూర్తి అయ్యింది. సిన్ ఫోరమ్ వ్యాక్సిన్ వేయగా.. మిగిలినది భారత్ కు చెందిన సీరం సంస్థ వారి కోవిషీల్డ్ టీకా వేస్తున్నారు.

అనూహ్యంగా టీకా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టిన తర్వాత కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదు కావటం ఇప్పుడో చర్చగా మారింది. గడిచిన వారంలో గుర్తించదగిన రీతిలో పాజిటివ్ కేసులు దేశంలో నమోదు కావటంపై ఆ దేశ ఆరోగ్య శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే.. దీనిపై ప్రపంచ ఆరోగ్య శాఖ కూడా స్పందించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం వైఫల్యం చెందిందన్న మాట.. తొందరపాటు చర్య అవుతుందని.. శాస్త్రీయ పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. అప్పుడు మాత్రమే టీకా వైఫల్యం ఎంతన్న విషయంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

రెండు డోసుల వ్యాక్సినేషన్ పొందిన వారిలో కూడా కేసులు నమోదు కావటం ఒక ఎత్తు కాగా.. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఊపిరిపీల్చుకునే అంశం.. వ్యాక్సినేషన్ జరిగిన వారు పాజిటివ్ బారిన పడినప్పటికి.. ఎవరూ మరణించకపోవటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇదో రకంగా శుభవార్తగానే వారు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కొన్ని వర్గాలు మాత్రం సీషెల్స్ లోని బి.1.351 వేరియంట్ పై కోవిషీల్డ్ సమర్థంగా పోరాటం చేయలేకపోతున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు టూరిస్టు స్పాట్ గా పేరున్న మాల్దీవులకు పెద్ద ఎత్తున రాకపోకలు పెరగటంతో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. మొత్తంగా చూసినప్పుడు వ్యాక్సినేషన్ తర్వాత కోవిడ్ బారిన పడుతున్నప్పటికి.. మరణాల లేకపోవటంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. అదే పది వేలన్న భావనను కొందరు వ్యక్తం చేయటం గమనార్హం.