Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర తర్వాత.. ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు

By:  Tupaki Desk   |   6 July 2020 3:30 AM GMT
మహారాష్ట్ర తర్వాత.. ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు
X
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్‌స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర హెల్త్ డిపార్టుమెంట్ ప్రకారం ఆదివారం నాటికి 10 లక్షల టెస్టులు పూర్తయ్యాయి. మొదటి 1 లక్ష టెస్టులు జరిపేందుకు 59 రోజుల సమయం పట్టగా, ఆ తర్వాత 9 లక్షల శాంపిల్స్ నిర్వహించేందుకు కేవలం 65రోజులు మాత్రమే తీసుకున్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 998 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,697కు చేరుకుంది. ఈ రోజు 14 మరణాలు చోటు చేసుకొని 232కు పెరిగాయి.

ఉదయం గం.9 సమయానికి హెల్త్ డిపార్టుమెంట్ నివేదిక ప్రకారం ఏపీలో అక్షరాలా 10,17,123 పరీక్షలు జరిగాయి. మహారాష్ట్ర తర్వాత పది లక్షల మార్క్ దాటిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏపీలో పాజిటివ్ రేటు 1.74 శాతంగా ఉంది. రికవరీ 60 శాతానికి చేరుకుంది. గత 24 గంటల్లో 391 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10,043. కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,422.

ఓ వైపు పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ పరీక్షలు నిర్వహించడంలో ఇబ్బందులు పడుతోంది. తక్కువ టెస్టులు నమోదవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహించింది. జగన్ ప్రభుత్వం ఎక్కువ టెస్టులు చేయిస్తుండటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2వేలు దాటాయి. నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తక్కువగా అంటే 190 నుండి 800 లోపు ఉన్నాయి.