వైసీపీ మీద దళిత మహిళా ఎంపీపీ ఫైర్

Mon Aug 15 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

Dalit women MPP fire on YCP

వైసీపీ బడుగు బలహీన వర్గాల పక్షం అని చెప్పుకుంటూ ఉంటుంది. అదే టైం లో ఎస్సీలు ఎస్టీలు తమ వైపే అని ధీమాగా ఉంటుంది. తమ పార్టీలోనే అణగారిన వర్గాలకు సమ న్యాయం అని కూడా చెప్పుకుంటుంది. అలాంటి వైసీపీలో ఒక దళిత మహిళ అందునా ఎంపీపీ వంటి కీలకమైన పదవిలో ఉన్న మహిళ మండిపడింది అంటే ఆలోచించాల్సిన విషయమే.బాపట్ల జిల్లాలో కర్లపాలెం వైసీపీ ఎంపీపీ యరం వనజ తనకు వైసీపీలో వేధింపులు తప్ప ఏ కోశానా  గౌరవం దక్కడంలేదని తీవ్ర ఆరోపణలు చేశారు.అంతే కాదు ఆమె నేరుగా ఉప సభాపతి కోన రఘుపతి  మీదనే విమర్శలు చేశారు. బాపట్ల ఎమ్మెల్యే కూడా అయిన  కోన రఘుపతి తనని మానసికంగా వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆయనకు తాను ఎంపీపీ పదవిలో ఉండడం ఇష్టం లేదని కూడా అన్నారు.

తన స్థానంలో ఒక రెడ్డిని ఎంపీపీగా చూడాలని ఆయన కోరుకుంటున్నారు అని వనజ ఆరోపించారు. తన ఎంపీపీ పదవిని రెడ్లకు కట్టబెట్టేందుకే ఆయన ఇదంతా చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇక తనను కులం పేరుతో కోన రఘుపతి దూషిస్తున్నారు అని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

ఇటీవల విద్యా దీవెన కార్యూక్రమం కోసం బాపట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తే కనీసం తనకు ఆహ్వానం లేకుండా కోన రఘుపతి చేశారని ఆమె అంటున్నారు. ప్రస్తుతం ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని అయినా కూడా దళితుల మీద వివక్ష పోలేదని న్యాయం జరగలేదని ఆమె అనడం విశేషం.

కేవలం తానొక్కరే కాదని చాలా మంది కోన రఘుపతి తీరుతో బాపట్లలో ఇబ్బందులు పడుతున్నారు అంటూ వనజ చెప్పుకొచ్చారు. డిప్యూటీ స్పీకర్ గా సౌమ్యుడిగా వివాదరహితునిగా పేరున్న కోన రఘుపతి మీద ఈ తరహా ఆరోపణలు రావడం నిజంగా ఆశ్చరమే. మరి ఆయన సొంత నియోజకవర్గంలో ఏ తీరున ఆయన వ్యవహార శైలి ఉందో చూడాలి. దళితులకు వైసీపీలో గౌరవం లేదు అన్న ఆమె మాట కనుక జనాల్లోకి బాగా వెళ్తే మాత్రం అది కోనకు మాత్రమే కాదు వైసీపీకే తీరని నష్టం అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ అధినాయకత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.