Begin typing your search above and press return to search.

దళిత బంధు.. హుజూరాబాద్‌.. కవల పిల్లలు అయ్యాయే

By:  Tupaki Desk   |   25 July 2021 10:30 AM GMT
దళిత బంధు..  హుజూరాబాద్‌.. కవల పిల్లలు అయ్యాయే
X
‘ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిందే’ అన్న నానుడి.. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్న నిజంతో సమానం. ఎవరూ ఉత్తినే సాయం చేయరు. జేబులో నుంచి తీసే ప్రతి పైసా వెనుక పరమార్థం ఉంటుంది. దాతలుగా చెప్పే వారు ఇచ్చే డబ్బులన్ని కీర్తి కాంక్షతో కానీ.. తమ చిరకాల స్వప్నాన్ని తీర్చుకోవటం కోసమే అన్నది మర్చిపోకూడదు. జనాల్ని ఉద్దరించేందుకు తీసుకొచ్చినట్లుగా చెప్పే పథకాలు ప్రజల బాగోగుల కంటే కూడా.. వారికి ఏదో చేస్తున్నామన్న భావన కలిగించి.. ఓట్లను దండుకోవటానికేనన్న చేదు నిజాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ దళిత బంధు పథకం మీద అదే పనిగా మాట్లాడుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అధికారులతో బ్యాక్ టు బ్యాక్ మీటింగులు పెట్టుకుంటున్నారే తప్పించి.. ఇంత భారీ పథకాన్ని ప్రవేశ పెట్టిన వేళలో మీడియాతో మాట్లాడాలన్న ఆలోచన ఎందుకు కలగటం లేదు? ఆ మాటకు వస్తే.. కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంతకాలమైందో గుర్తుకు తెచ్చుకుంటే.. ఎందుకిలా? అన్న సందేహం కలుగక మానదు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ సైతం మీడియా భేటీల్ని నిర్వహించరన్నది మర్చిపోకూడదు.

ఈ విషయాల్ని పక్కన పెడితే.. తాజాగా దళిత బంధు పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్.. మాటకు ముందు దళిత బంధు.. మాట చివరన హుజూరాబాద్‌ పేరును ప్రస్తావిస్తున్న వైనం చూస్తే.. అసలు విషయం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. ఎవరెన్ని చెప్పినా.. ఉన్నట్లుండి హటాత్తుగా దళితుల మీద అంత భారీగా ప్రేమ పొంగుకు రావటానికి కారణం.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అన్నది వాస్తవం.

తాజాగా ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు.. ప్రజాప్రతినిధులు.. మేధావులు.. కార్యకర్తలతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కలల పంటగా చెబుతున్న దళిత బంధు పథకాన్ని చెప్పే క్రమంలో.. ప్రతి మాట చివర్లో హుజూరాబాద్‌ ప్రస్తావన తేవటం ద్వారా.. అర్జెంట్ గా ఆ నియోజకవర్గం మీద ముఖ్యమంత్రికి అంతలా ప్రేమ ఎందుకు పొంగుకు వచ్చిందో అర్థమైపోతుంది. తాజాగా సీఎం కేసీఆర్ మాటల్ని విన్న వారందరికి దళిత బంధు.. హుజూరాబాద్‌ రెండూ కవలలుగా మారారని చెప్పక తప్పదు.

తాను అనుకున్నంతనే తాను టార్గెట్ చేసిన టాపిక్ ను హాట్ టాపిక్ గా మార్చే సత్తా ఉన్న కేసీఆర్.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే నాటికి మరెన్ని సిత్రాలకు తెర తీస్తారన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. రూ.లక్ష కోట్ల పథకంగా వైరల్ అవుతున్న తెలంగాణ దళిత బంధుతో ప్రయోజనం పొందేది ఎందరికో? ఎంతమంది అకౌంట్లలో రూ.పది లక్షల చొప్పున జమ అవుతాయన్నది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.