దాడిశెట్టి ఔట్... వైసీపీలో కీలక చర్చ...!

Fri Mar 17 2023 14:00:01 GMT+0530 (India Standard Time)

DadiShetty out... Key discussion in YCP...!

దాడిశెట్టి రామలింగేశ్వర రావు. ఉరఫ్ రాజా. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన రాజకీయ నాయకుడు. టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబానికి రాజకీయంగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న నేతగా కూడా ఆయన గుర్తింపు పొందారు. వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. అలాంటి నాయకుడికి సీఎం జగన్ అనూహ్యంగా మరింత గౌరవం ఇచ్చారు.



రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో దాడిశెట్టి రాజాకు తన కేబినెట్లో జగన్ ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ మంత్రిగా రాజా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆయన చుట్టూ రాత్రికి రాత్రి రాజకీయం ముసురుకుంది. తాజాగా జగన్ చేసిన 'వికెట్ల' వ్యాఖ్యల నేపథ్యంలో రాజా పదవికి గండం ఉందని అంటున్నారు. మూడు నాలుగు వికెట్లు పడిపోతాయి అంటూ..తాజాగా జగన్ వ్యాఖ్యానించారు.

అంటే మంత్రి వర్గంలోని కొందరిని పక్కన పెట్టే వ్యూహాన్ని జగన్ అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు నాయకుడు ఫైర్ బ్రాండ్కు జగన్ అవకాశం ఇవ్వను న్నట్టు కూడా చర్చ సాగుతోంది. దాడిశెట్టి రాజా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఒక జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పోనీ.. రాజానే కొనసాగించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనే అంచనా కూడా ఉంది.

అదే జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కాపులను ప్రభావితం చేసే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తోటను ఎమ్మెల్సీ కోటాలో మంత్రి వర్గంలోకి తీసుకుని.. రాజాను పక్కన పెట్టడం ఖాయమనే అంచనాలు వేస్తున్నారు. ఇదే జరిగితే.. మరి రాజా ఏం చేస్తారనేది చూడాలి. ఏదేమైనా.. దాడిశెట్టి పీఠం మాత్రం కదలడం ఖాయంగానే కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.