డీఎల్లో ఇంత అయోమయమా ?

Sat Aug 13 2022 10:12:02 GMT+0530 (IST)

DL Ravindra Reddy So Confused?

డీఎల్ రవీంద్రారెడ్డి చాలా అనుభవం ఉన్న నేతనటంలో సందేహంలేదు. కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గంలో చాలాసార్లు గెలిచారు కొన్నిసార్లు ఓడిపోయారు. చరిత్రను వదిలేస్తే ఇపుడు మాత్రం చాలా అయోమయంలో ఉన్నట్లు అర్ధమైపోతోంది. ఏపార్టీలో చేరాలో కాదు చివరకు తాను ఏపార్టీలో ఉన్నారో కూడా జనాలకు అర్ధం కావటంలేదు. ఎందుకంటే డీఎల్ అవుట్ డేటెడ్ నేతయిపోయారనటంలో సందేహంలేదు.మీడియాతో తాజాగా ఆయన మాటలే ఆయనలోని అయోమయాన్ని స్పష్టంచేస్తున్నాయి. అధికార ప్రతిపక్షపార్టీలు ప్రజాసమస్యలను పట్టించుకోవటంలేదని  ఆరోపించారు. సమస్యలతో తన దగ్గరకు ఎవరైనా జనాలు వస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ తర్వాత ఆయన మాట్లాడిన మాటలే విచిత్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రముఖ రాజకీయపార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు చెప్పారు.

ఇక్కడే డీఎల్ మాటలు ఎవరికీ అర్ధంకావటంలేదు. రాష్ట్రంలో వైసీపీ ఒకటే అధికారపార్టీ అన్న విషయం అందరికీ తెలుసు. మిగిలిన టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలన్నీ ప్రతిపక్షాలే. డీఎల్ ఆరోపణల ప్రకారం తీసుకున్నా ప్రజాసమస్యలను వైసీపీతో పాటు ప్రతిపక్షాలు ఏవీ పట్టించుకోవటంలేదు.

మరి రాబోయే ఎన్నికల్లో ప్రముఖ రాజకీయపార్టీ తరపున పోటీచేస్తానంటే అర్ధమేంటి ? ఏపార్టీ తరపున పోటీచేయబోతున్నారో స్పష్టంచేయలేదు. ప్రజాసమస్యలను పట్టించుకోవటంలో అన్నీపార్టీలు ఫెయిలైనట్లు చెబుతునే ప్రముఖ రాజకీయపార్టీ తరపున పోటీచేస్తానని చెప్పటంలో అర్ధంలేదు.

ఎందుకంటే ఇపుడున్న పార్టీల్లోనే ఏదో ఒకపార్టీ తరపున పోటీచేయాల్సిందే కదా. ఫెయిలైన పార్టీ తరపున పోటీచేయాలని అనుకుంటున్నట్లే కదా అర్ధం. డీఎల్ నిలకడలేని తనమే ఆయనకు పెద్ద మైనస్ అయ్యింది.

సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న డీఎల్ తర్వాత కొంతకాలం టీడీపీలో ఉన్నారు. అక్కడ ఇమడలేక వైసీపీలో చేరారు. ఇక్కడా ఉండలేక బయటకు వెళ్ళిపోయారు. బహుశా డీఎల్ ఆలోచనల ప్రకారం బీజేపీలోకో లేకపోతే జనసేనలోనే చేరుతారేమో. చూద్దాం ఆయన రాజకీయ పయనం ఏపార్టీతో సాగుతుందో.