Begin typing your search above and press return to search.

డీకే...కాంగ్రెస్ కే బిగ్ ట్రబుల్ అవుతున్నారా...?

By:  Tupaki Desk   |   15 May 2023 9:46 PM IST
డీకే...కాంగ్రెస్ కే బిగ్ ట్రబుల్ అవుతున్నారా...?
X
ఆయనను ట్రబుల్ షూటర్ గా కర్నాటక రాజకీయాల్లో చెప్పుకుంటారు. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే రంగంలోకి దిగిపోయి పరిష్కరించడమే ఆయనకు తెలుసు. ఆయన కనుక టేకప్ చేశాడు అంటే ప్రాబ్లెమ్ అన్నది లేకుండా పోతుంది. దటీజ్ డీకే అని పేరు తెచ్చుకున్నారు. అలాంటి కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివ కుమార్ ఇపుడు కాంగ్రెస్ అధినాయకత్వానికే బిగ్ ట్రబుల్ అవుతున్నారని అంటున్నారు.

ఆయన కర్నాటక సీఎం సీటునే టార్గెట్ చేశారు. నా దగ్గర ఎలాంటి బేరాలు లేవని చెప్పేస్తున్నారు. తానే అయిదేళ్ళ సీఎం అని అంటున్నారు. చెరి రెండున్నరేళ్ళు సీఎం గా ఉండాలని ఒక ఫార్ములా హై కమాండ్ రూపొందించినా డీకే నో అనేస్తున్నారు. నాకు ఇస్తే అయిదేళ్ల సీఎం పోస్ట్ ఇవ్వండి. లేక పోతే లేదు, నాకు కనీసం మంత్రి పదవి కూడా సిద్ధరామయ్య క్యాబినెట్ లో వద్దు అని తేల్చేస్తున్నారు.

కర్నాటక కాంగ్రెస్ ఇంచార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాతో మూడు గంటల పాటు డీకే సమావేశం అయినా ఒక్కటే మాట చెప్పారని అంటున్నారు. ఎందుకొచ్చిన బేరాలు. నాకు సీఎం పదవి మాత్రమే కావాలి. నా ఆప్షన్ అదే. రెండవ చాన్స్ లేదని అంటున్నారని టాక్. ఇక కర్నాటకకే చెందిన ఏఈసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గె సైతం చెరి రెందున్నరేళ్ళు పదవి తీసుకోమని కోరారు. దానికి సిద్ధరామయ్య ఒకే చెప్పినా డీకే మాత్రం నో అనడమే కాంగ్రెస్ పెద్దలకు షాకింగ్ గా మారింది.

ఇదిలా ఉంటే సిద్ధరామయ్య రెండున్నరేళ్లు కాదు రెండేళ్ళు తనకు సీఎం పోస్ట్ చాలు అని మరో ప్రతిపాదన పెట్టారు. తనకు వయసు అయిపోతున్నందువల్ల్ల తొలి టెర్మ్ తానే ఉంటాను ఆ మీదట డీకే కి ఇవ్వండి అని ఆయన అంటున్నారు. ఇక హై కమాండ్ తీరు చూసినా సిద్ధరామయ్యకే చాన్స్ ఇవ్వాలనుకుంటోందని టాక్.

ఆదాయానికి మించిన ఆస్తులు అన్న దాని మీద డీకే శివకుమార్ మీద సీబీఐ కేసులు పెట్టింది. ఆయన కొన్నాళ్ళు జైలులో ఉన్నారు. ఇక డీకే మీద ఏకంగా మొత్తం 19 కేసులు పెండింగులో ఉన్నాయి. అందులో 2020 నుంచి 2023 దాకా పెట్టిన కేసులు 13 ఉన్నాయి. కర్నాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ని సీబీఐ డైరెక్టర్ గా చేసి బీజేపీ డీకేని టార్గెట్ చేస్తోంది అని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ఆయన్ని కనుక సీఎం గా చేస్తే కేసులు మీద పడతాయన్న కంగారు కాంగ్రెస్ పెద్దలకు ఉంది.

దాంతో పాటు 2024లో కర్నాటక లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇస్తే కనుక కురుబ సామాజిక వర్గం ఓబీసీ ఓటు బ్యాంక్ అంతా మొత్తం టర్న్ అవుతుందని, అలాగే ఆయన పలుకుబడి మంచి తనం కాంగ్రెస్ కి ప్లస్ అయి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.

అయితే ఆవేశంగా ఉన్న డీకేని ఎవరూ సర్దుబాటు చేసి సముదాయించలేక పోతున్నారు అని అంటున్నారు. ఆయన పంతం ఇపుడు కాంగ్రెస్ పెద్దలను కలవరపెడుతోంది. ఈ బిగ్ ట్రబుల్ నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నారు. డీకే ట్రబుల్ షూటర్ గా ఉంటూ సొంత పార్టీకే ట్రబుల్స్ ని తేవడం మంచిదేనా అని అంటున్నారు.

మొత్తానికి డీకే ఇదే తీరున వ్యవహరిస్తే మాత్రం కాంగ్రెస్ ఒక కఠిన నిర్ణయం తీసుకుని సిద్ధరామయ్యకే సీఎం పగ్గాలు అప్పగిస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలతో పాటు కర్నాటక ప్రజలు కూడా సిద్ధరామయ్యకే కోరుకుంటున్నారు. మరి పంతానికి పోయి మలి విడతలో సీఎం చాన్స్ ని డీకే వదులుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.