Begin typing your search above and press return to search.

ఓవైపు భారీగా పెరుగుతున్నకేసులు.. మరోవైపు ఎండెమిక్ అంటున్నారు.. ఏది నిజం?

By:  Tupaki Desk   |   25 Jun 2022 4:33 AM GMT
ఓవైపు భారీగా పెరుగుతున్నకేసులు.. మరోవైపు ఎండెమిక్ అంటున్నారు.. ఏది నిజం?
X
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాకు సంబంధించిన చర్చ మళ్లీ మొదలైంది. ఇప్పటికే ఒకటి.. రెండు.. మూడు వేవ్ లను చూసిన వారికి ఇప్పుడు నాలుగో వేవ్ ముంచుకొస్తుందన్న మాట వినిపిస్తోంది. మూడు వేవ్ లను చూసిన వేళ.. నాలుగో వేవ్ ను తేలిగ్గా తీసుకోవటం తప్పే అవుతుంది. మరి.. ఎండెమిక్ అంటూనే.. గడిచిన వారంలో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరి.. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోనూ.. మహానగరాల్లోనూ కేసుల నమోదు భారీగా పెరుగుతోంది.

మరి.. కేసులు నమోదు అవుతున్న వేళలో ఎండెమిక్ అని ఎందుకు చెబుతారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకొచ్చారు ఎయిమ్స్ లో సీనియర్ ఎపిడమాలజిస్ట్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ సంజయ్ రాయ్. మహమ్మారి నుంచి ఎండెమిక్ దశకు వచ్చే సమయంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా రావటం సహజమేనని చెబుతున్నారు.

ఇక.. రాయ్ మాటల్ని చూస్తే.. "కరోనా వైరస్ ఇప్పటికే వెయ్యి మ్యుటేషన్లు జరిగినప్పటికి.. అందులో ఐదు మాత్రమే ఆందోళనకు గురి చేశాయి. ఒమిక్రాన్ విషయంలో ఉత్పరివర్తనాలు చోటు చేసుకున్నాయి. అందుకే రీ ఇన్ ఫెక్షన్.. బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ లకు కారణమవుతున్నాయి. పాండమిక్ నుంచి ఎండెమిక్ దశకు మార్పు చెందే వేళలో.. ఇలా కేసులు ఎక్కువ కావటం జరుగుతుంటుంది" అని పేర్కొన్నారు.

ఇప్పుడు నమోదు అవుతున్న కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కాకుంటే.. తీవ్రత ఎక్కువగా ఉండి.. ఆసుపత్రిలో చేరక తప్పని పరిస్థితులు నెలకొనటం.. మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని.. మిగిలిన సందర్భాల్లో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.

ఇప్పటికే చాలామంది వైరస్ బారిన పడి.. కోలుకున్నారని.. అందువల్ల పొందిన రోగ నిరోధకత చాలాకాలం పాటు రక్షణను ఇస్తుందని చెప్పారు. ఈ రక్షణను దెబ్బ తీసేలా బలమైన కొత్త వేరియంట్ వస్తే తప్పించి.. అంతవరకు మరే విషయంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సో.. దేశ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్ని చూస్తే.. మహారాష్ట్ర.. కేరళ.. ఢిల్లీ..కర్ణాటక.. తమిళనాడు.. హర్యానా.. ఉత్తరప్రదేశ్.. తెలంగాణ.. పశ్చిమ బెంగాల్.. గుజరాత్.. గోవా.. పంజాబ్ రాష్ట్రాల్లో గడిచిన రెండు వారాలుగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. పైన పేర్కొన్న రాష్ట్రాలతో పాటు అసోం.. మిజోరం.. ఢిల్లీలోని పలు జిల్లాల్లోనూ వైరస్ తీవ్రతఎక్కువగా ఉండి.. భారీగా కేసులు నమోదువుతున్నాయి. తాజాగా విడుదలైన కేంద్ర ఆరోగ్య శాఖ రిపోర్టు ప్రకారం.. రోజువారీ కేసుల సంఖ్య 17 వేలకు చేరుకుంది. పాజిటివిటీ రేటు కూడా నాలుగు శాతం దాటటంతో నాలుగో వేవ్ దేశంలో షురూ అయినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈసారికి మాత్రం పెద్దగా బయటపడాల్సిన అవసరం లేదంటున్నారు. అలా అని నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దు సుమా.