Begin typing your search above and press return to search.

పెరిగిపోతున్న కోవర్టుల గోల

By:  Tupaki Desk   |   8 Jun 2023 2:00 PM GMT
పెరిగిపోతున్న కోవర్టుల గోల
X
ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో తెలంగాణాలో కోవర్టుల గోల పెరిగిపోతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలో కేసీయార్ కోవర్టులు ఉన్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. తన కోవర్టులను ఇతర పార్టీల్లోకి ప్రవేశపెట్టడం కేసీయార్ కు చాలా అవసరమని ఇతర పార్టీల్లోని నేతలంటున్నారు. తన కోవర్టులిచ్చిన సమాచారం ఆధారంగానే ప్రత్యర్ధిపార్టీలను ఇబ్బందిపెట్టేట్లుగా కేసీయార్ వ్యూహాలు రచిస్తుంటారనే ప్రచారానికి, ఆరోపణలకు కొదవేలేదు. కేసీయార్ కోవర్టుల విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారు.

అలాగే బీజేపీ నేతలు కూడా దీన్ని పరోక్షంగా అంగీకరించారు. చాలాకాలం కిందట రేవంత్ మాట్లాడుతు పార్టీలోని కేసీయార్ కోవర్టులంతా వెంటనే బయటకు వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ వెళ్ళటం ఇష్టంలేకపోతే కోవర్టు పనులు మానుకుని పార్టీకోసమే పనిచేయాలని బంపర్ ఆఫరిచ్చారు. అంటే దీని అర్ధమేంటి ? కాంగ్రెస్ లో కేసీయార్ కోవర్టులున్నారని రేవంత్ అంగీకరించినట్లే కదా. అందుకనే వెంటనే కేసీయార్ కోవర్టులెవరో చెప్పాలంటు బహిరంగంగానే కొందరు సీనియర్లు రేవంత్ ను డిమాండ్ చేశారు.

ఇప్పటి సంగతి తెలీదుకానీ ప్రత్యేక తెలంగాణా ప్రకటించకముందు చాలామంది కాంగ్రెస్ నేతలు కేసీయార్ కు అనుకూలంగా పనిచేశారనే ప్రచారం జరిగింది. కేసీయార్ చెప్పిన మాటలనే కాంగ్రెస్ సీనియర్ నేతల్లో చాలామంది సోనియాగాంధి, రాహుల్ గాంధీలకు తమ సొంత అభిప్రాయాలుగా చెప్పినట్లు అప్పట్లో బాగా ఆరోపణలొచ్చాయి. చివరకు ప్రత్యేక తెలంగాణా ప్రకటించగానే టీఆర్ఎస్ ను కేసీయార్ కాంగ్రెస్ లో కలిపేస్తారని నమ్మబలకటం కూడా కోవర్టుల వ్యూహమేనని చెప్పుకున్నారు.

ఇక బీజేపీలో కూడా కేసీయార్ కోవర్టులున్నారని ఈమధ్యనే ఆరోపణలు మొదలయ్యాయి. మరా కోవర్టులను పార్టీ గుర్తించిందా లేదా అన్నది తెలీలేదు. ఇక బీఎస్పీలో కేసీయార్ కోవర్టులంటేనే ఆశ్చర్యంగా ఉంది. బీఎస్పీకి ఉన్నదెంత పోయేదెంత ? రాబోయే ఎన్నికల్లో పోటీచేస్తే కానీ బీఎస్పీకి ఉన్న సీనేంటో తెలీదు. ఇంతోటిదానికి బీఎస్పీలో ప్రత్యేకంగా కేసీయార్ కోవర్టులను ప్రవేశపెట్టాలా అన్నదే ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పై పార్టీల్లో కేసీయార్ కోవర్టులనే గోల కూడా పెరిగిపోతోంది. మరి కోవర్టులు ఎప్పటికి బయటపడతారో ఏమో చూడాల్సిందే.