Begin typing your search above and press return to search.

బ్రెజిల్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కోవాగ్జిన్ డీల్!

By:  Tupaki Desk   |   23 Jun 2021 4:33 AM GMT
బ్రెజిల్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కోవాగ్జిన్ డీల్!
X
మాయదారి మహమ్మారికి చుక్కలు చూపిస్తుందన్న పేరున్న కోవాగ్జిన్ టీకా ఇప్పుడా దేశంలో కొత్త వివాదానికి కారణమైంది. అంతేకాదు.. ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకునేలా చేయటమే కాదు.. ఆ దేశ ప్రభుత్వానికి చెమటలు పట్టే పరిస్థితి. ఇంతకీ అసలేం జరిగింది? ఆ దేశం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

భారత్ బయోటెక్ కు చెందిన కోవాగ్జిన్ టీకా సరఫరాకు సంబంధించి బ్రెజిల్ తో ఒప్పందం కుదిరింది. ఈ డీల్ వెనుక భారీ కుంభకోణం ఉందన్న వాదన అంతకంతకూ ఎక్కువ అవుతోంది.దీంతో.. పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇప్పుడు మరింత లోతుగా విచారణ జరుపుతోంది. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సానారో ఈ ఎపిసోడ్ లో చిక్కుల్లో పడినట్లుగా ప్రచారం జరుగుతోంది.

కోవాగ్జిన్ టీకా డీల్ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారని.. ఆయన సన్నిహితులకు లాభం చేకూరేలా లావాదేవీలు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. అమెరికాకు చెందిన ఫైజర్.. చైనాకు చెందిన సినోవాక్ ను కాదని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. బ్రెజిల్ ప్రజారోగ్య నియంత్రణ సంస్థ అనుమతి లేని కోవాగ్జిన్ కోసం బ్రెజిల్ ప్రభుత్వం ఎందుకంత ఆసక్తిని ప్రదర్శించిందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాదిరే బ్రెజిల్ దేశాధ్యక్షుడు బొల్సొనారో కూడా కాస్త భిన్నమైన అధినేత. కరోనా వేళలో ఆయన మాస్కుపెట్టుకోకపోవటం.. సామాజిక దూరాన్ని పాటించకపోవటం లాంటి విమర్శలు ఉన్నాయి. నిజానికి కరోనా నియంత్రణలో ప్రభుత్వం సరిగా స్పందించని కారణంగా ఆ దేశం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందని చెబుతారు. వ్యాక్సిన్లను నమ్మని బ్రెజిల్ దేశాధ్యక్షుడు.. కోవాగ్జిన్ డీల్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కోవాగ్జిన్ 2 కోట్ల డోసులతో పాటు టెక్నాలజీని కూడా బదిలీ చేసేందుకు వీలుగా రూ.2,230 కోట్లతో ఒక డీల్ ను చేసుకున్నారు. దీనికి బ్రెజిల్ కు చెందిన ప్రెసిసా మెడికామెంటోస్ అనే సంస్థ మధ్యవర్తిగా వ్యవహరించింది. ఇందుకోసం ఆ సంస్థకు రూ.734 కోట్లు ముట్టినట్లుగా చెబుతున్నారు. మొత్తం డీల్ రూ.2230 కోట్లు అయినప్పుడు అందులో రూ.734 కోట్లు ఏకంగా కమిషన్ కావటం పలు సందేహాలకు దారి తీస్తోంది. దీనికి సంబంధించిన పలు పత్రాలు ఇప్పుడు అక్కడి మీడియాలో హడావుడి చేస్తున్నాయి. అయితే.. తాము కోవాగ్జిన్ కోసం ఎలాంటి చెల్లింపులు జరపలేదని స్పష్టం చేసింది. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి రాక ముందే.. బ్రెజిల్ లో కోవాగ్జిన్ కు ఓకే చెప్పేయటం ఏమిటన్నది ఇప్పుడు పెద్ద సందేహం గా ఉంది. మొత్తంగా కోవాగ్జిన్ తో డీల్ ఏమో కానీ.. బ్రెజిల్ దేశాధ్యక్షుడిని మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.