Begin typing your search above and press return to search.

అభ్యర్ధుల పై కోర్టు ధిక్కరణ కేసులు

By:  Tupaki Desk   |   19 Jan 2022 5:38 AM GMT
అభ్యర్ధుల పై కోర్టు ధిక్కరణ కేసులు
X
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నేర చరిత్రను తప్పనిసరిగా ప్రకటించాలనే నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అభ్యర్థులు తమ నేర చరిత్రను గనుక నామినేషన్తో పాటు అందించకపోతే వారిపై అనర్హత వేటు వేయటంతో పాటు కోర్టు ధిక్కారం కేసులు కూడా నమోదు చేయాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ అనే లాయర్ కేసు వేశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి అత్యవసర వ్యాజ్యం రూపంలో తన పిటిషన్ విచారణ చేయాలని కూడా సదరు లాయర్ అభ్యర్ధించారు. లాయర్ అభ్యర్ధనను పరిశీలిస్తామంటు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఈ కేసు, విచారణను పక్కన పెట్టేస్తే ఎన్నికల్లో నేరచరితులు పోటీ చేయడం అన్నది చాలా ఎక్కువైపోతోందన్నది వాస్తవం. ఎప్పుడైతే ఎన్నికల్లో డబ్బు పాత్ర బాగా ఎక్కువైపోయిందో నేరచరితుల ప్రమేయం కూడా పెరిగిపోయింది.

కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే పట్టుదల అభ్యర్థుల్లో సహజం. గెలవాలంటే ఓట్లు తమకే అనుకూలంగా పడాలి. తమకే అనుకూలంగా పడకపోతే ఓటమి ఖాయం. అందుకనే ఓట్లు వేయించుకోవటానికి, కుదరకపోతే తామే వేసుకోవటానికి వీలుగా మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఓట్లు వేసే మనుషులు కావాలంటే మామూలు జనాలు సరిపోరు.

ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయటం, పోలింగ్ కేంద్రాలను తమ అదుపులోకి తీసుకోవటం లాంటి అనేక పనులు చేయాల్సుంటుంది. దీంతో నేరగాళ్ళ పాత్ర చాలా కీలకమైంది. కాలక్రమంలో ఎవరికో తామెందుకు పనిచేయాలన్న ఆలోచనతో కొందరు నేరగాళ్ళు, ఎవరికో టికెట్లిచ్చేబదులు నేరచరిత్ర ఉన్నా సరే పర్వాలేదన్న ఉద్దేశ్యంతో పార్టీలు ఆలోచించాయి. దాంతో కొన్నిచోట్ల నేరచరిత్రున్న వాళ్ళు ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.

ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు. దాదాపు అన్ని పార్టీలది ఒకేదారిగా కనబడుతోంది. అందుకనే ఎంత కట్టడి చేసినా వీళ్ళను ఆపటం సాధ్యం కావటం లేదు. అందుకనే నేర చరిత్ర అఫిడవిట్లో చెప్పకపోతే అనర్హులను చేయటంతో పాటు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ప్రకటించాలని పిటిషన్ దాఖలైంది. మరి సుప్రీంకోర్టు ఏమి చెబుతుందో చూడాలి.