Begin typing your search above and press return to search.

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   21 May 2022 8:36 AM GMT
ఓబుళాపురం మైనింగ్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు
X
అక్రమార్కుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లింది.. ఓబుళాపురం మైన్స్‌. గాలి బ్రదర్స్‌ (గాలి జనార్ధన్‌ రెడ్డి, గాలి కరుణాకర్‌రెడ్డి, గాలి సోమశేఖరరెడ్డి), బీజేపీ నేత శ్రీరాములు (ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి) తదితరులు ఓబుళాపురం మైన్స్‌ను చెరపట్టారని 2008లో తీవ్ర విమర్శలు, ఆరోపణలు రేగాయి. అప్పట్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న గాలి జనార్ధన్‌రెడ్డి.. నాటి కర్ణాటక సీఎం యడ్యూరప్ప, అప్పటి ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అండదండలతో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.

నిబంధనలకు పాతరేసి.. పర్యావరణ అనుమతులు తోసిరాజని.. కొంతమంది అధికారులను బెదిరించి.. కొంతమందికి ముడుపులు ఇచ్చి ఓబుళాపురంలో ఐరన్‌ ఓర్‌ను అక్రమంగా తవ్వుకుని వందల కోట్ల రూపాయలు లబ్ధి పొందారని గాలి జనార్దన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత ఈ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి జైలుపాలు కూడా అయ్యారు. బెయిల్‌ కోసం న్యాయమూర్తికి ఐదు కోట్ల రూపాయలు ఆఫర్‌ చేసి జనార్దన్‌రెడ్డికి చెందిన వ్యక్తులు సంచలనం సృష్టించారు.

ఇప్పుడు మరోసారి ఓబుళాపురం మైనింగ్స్‌ చర్చనీయాంశం అయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం సివిల్‌ కోర్టు తాజాగా ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ ఎండీ శ్రీనివాసరెడ్డికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2008లో ఓబుళాపురం గనుల తవ్వకాలకు వచ్చిన అధికారులను అడ్డుకుని.. వారిపై దాడికి ప్రయత్నించిన కేసులో తాజాగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ఓబుళాపురం గనుల్లో నిర్దేశించిన అనుమతులకు మించి అక్రమంగా ఐరన్‌ ఓర్‌ తవ్వడంతోపాటు అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో అడ్డుకోవడానికి వెళ్లిన అటవీ అధికారులపై మైనింగ్స్‌ ఎండీ శ్రీనివాసరెడ్డి దాడికి ప్రయత్నించారు. దీంతో విధి నిర్వహణలో ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసు నమోదైంది.

కాగా అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మైన్స్‌ కర్ణాటక–ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉండటమే కారణం. దీనిపై ప్రతిపక్ష నేతలు నాటి బీజేపీ ప్రభుత్వం, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

దీంతో ఓబుళాపురం మైన్స్‌ ఎండీ శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. 2008 నుంచి దాదాపు 14 ఏళ్లు సాగిన విచారణలో ఎట్టకేలకు ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. మరోవైపు పలు సినిమాలకు ఓబుళాపురం మైన్స్‌ మూలవస్తువుగా మారింది. దర్శకులు ఆయా సినిమాల్లో ఓబుళాపురం మైన్స్‌ తరహాలో సీన్లు పెట్టేవారు. కాగా రాయదుర్గం సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఓఎంసీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారని తెలుస్తోంది.