ఇస్లాంను హిందూయిజం కాపీ కొట్టేస్తోంది

Thu Aug 16 2018 13:22:21 GMT+0530 (India Standard Time)

Country 1st Hindu court on lines of Sharia system


షరియత్ కోర్టులు..ముస్లిం సంప్రదాయంలో ఉండే అనధికార న్యాయవ్యవస్థ. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ఇటీవలే ఈ కోర్టులకు సంబంధించి ఆసక్తికర చర్చ జరిగింది. దేశంలోని అన్ని జిల్లాల్లో షరియత్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్ బీ) ప్రయత్నిస్తోందని ఆ సంస్థ సీనియర్ సభ్యుడు జాఫర్ యాబ్ జిలానీ వెల్లడించారు. ఇలాంటి కోర్టులు ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ లో 40 ఉన్నాయని - దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక కోర్టునైనా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ పరిణామంపై వివిధ రాష్ర్టాల్లో చర్చలు జరిగాయి. షరియత్ కోర్టులపై మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది. న్యాయ విచారణ పేరుతో మసీదుల్లో అనధికార కోర్టుల నిర్వహణ చెల్లదని స్పష్టం చేసింది. మత ప్రదేశాల్లో కేవలం దైవ ప్రార్థనల కోసమే ఉపయోగించాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ - జస్టిస్ ఎం సుందర్ లతో కూడిన ధ్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.



అయితే ఇలా వివాదాస్పదం అయిన షరియత్ కోర్టుల ఉదంతాన్ని హిందూయిజంలోకి కూడా దించాలని ప్రయత్నం జరుగుతోంది! ప్రత్యేక షరియా కోర్టుల తరహాలో ప్రత్యేకంగా హిందూ కోర్టును స్వాతంత్య్ర దినోత్సవం రోజే అఖిల భారతీయ హిందూ మహాసభ నెలకొల్పింది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం ముస్లింల సమస్యలను షరియా కోర్టులు ఎలా పరిష్కరిస్తాయో అలాగే హిందువుల సమస్యలను ప్రత్యేక హిందూ కోర్టులు పరిష్కరిస్తాయని మహాసభ నాయకులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ నగరంలో జరిగిన ప్రత్యేక హిందూ కోర్టు ప్రారంభ కార్యక్రమంలో మొట్టమొదటి న్యాయమూర్తిని కూడా ఎన్నుకోవడం గమనార్హం. అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా శంఖున్ పాండే మొట్టమొదటి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భవిష్యత్తులో తగినన్ని జైళ్లు నెలకొల్పుతామని.. గరిష్ఠంగా మరణదండన వరకు శిక్షలు విధిస్తామని పేర్కొన్నారు.

ముస్లింలలోనే విభిన్న స్వరాలకు  వేదికగా మారిన షరియత్ కోర్టులు హిందూయిజంలో మనుగడ సాధిస్తాయా?  భావప్రకటన స్వేచ్ఛను గౌరవించే హిందూ మతం ఇలాంటి స్వీయ నిర్ణయాలను ఆమోదిస్తుందా? అసలు వీటికి చట్టబద్దత ఏంటి?  ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.