Begin typing your search above and press return to search.

నువ్వా నేనా అన్నట్లుగా పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ఇలా

By:  Tupaki Desk   |   18 March 2023 10:05 AM GMT
నువ్వా నేనా అన్నట్లుగా పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ఇలా
X
ఉత్తరాంధ్ర.. తూర్పు రాయలసీమ.. పశ్చిమ రాయలసీమకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారటం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాల వైపు తెలుగు వారు చూసేలా మార్చాయి. ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా ఏపీలో ఏం జరుగుతుందన్న ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ వరకు.. ఆ మాటకు వస్తే ఓట్ల లెక్కింపు వేళలోనూ పెద్దగా ఆసక్తిని ప్రదర్శించింది లేదు. కారణం.. ఫలితం తాము అనుకున్నట్లుగా అధికారపక్షంలో ఖాతాలోనే చేరతాయని భావించటమే.

అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఉత్తరాంధ్ర.. తూర్పు రాయలసీమకు సంబంధించి వెలువడిన ఫలితాలు షాకింగ్ గా మారాయి. ఈ ఫలితాల్ని విశ్లేషించేందుకు అధికార వైసీపీ నేతలకు అర్జెంట్ గా కొత్త వాదనల్ని వెతుక్కోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు తాము చెప్పిన మాటలకు భిన్నమైన ఫలితాలు రావటంతో కిందా మీదా పడిన పరిస్థితి. మరోవైపు పార్టీకి కంచుకోటలా ఉండే పశ్చిమ రాయలసీమ ప్రాంతంలోనూ టీడీపీ అభ్యర్థి చెలరేగిపోవటం.. వైసీపీ అభ్యర్థికి అధిక్యత దక్కుండా ముప్పు తిప్పలు పెట్టి.. మూడు చెరువులు తాగించే రీతిలో వెలువడుతున్న మెజార్టీ లెక్కలు వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ గా మారాయి.

ఈ ఫలితాల కారణంగా అధినేత జగన్ ఎంతలా ఆగ్రహం చెందుతారో ఆలోచిస్తేనే.. వణుకు పుడుతుందన్న మాట కొందరు నేతలు లోగుట్టుగా వ్యాఖ్యానించటం చూస్తే.. పరిస్థితి ఎలా ఉందన్నది అర్థమయ్యే పరిస్థితి. ఉత్తరాంధ్ర.. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియెజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం అధికారికంగా మారిన వేళ.. పశ్చిమ రాయలసీమ ఓట్ల లెక్కింపు ఎంతకు తెగకపోవటంతోఇప్పుడు అందరి చూపు దాని మీద పడింది. గురువారం మొదలై శుక్రవారం మొత్తం ఓట్ల లెక్కింపు సాగింది. ఈ రోజు (శనివారం)కూడా కొనసాగనుంది.

శనివారం ఉదయం 8 గంటల వేళకు.. ఈ ఓట్ల లెక్కింపు ఎక్కడి వరకు వచ్చింది? తర్వాత ఏం జరుగుతుంది? అన్న విషయాల్లోకి వెళితే.. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తిఅయ్యింది. మొత్తం 11 రౌండ్లు ఓట్ల లెక్కింపు తర్వాత.. వైసీపీ.. టీడీపీ అభ్యర్థుల గెలుపునకు అవసరమైన ఓట్లు రాలేదు. దీంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డికి కేవలం 1820 స్వల్ప ఓట్ల అధిక్యతలో ఉన్నారు. మొత్తం 49 మంది పోటీ పడ్డఈ స్థానంలో చెల్లని ఓట్లు తీవ్ర ప్రభావాన్ని చూపాయని చెప్పాలి. మొత్తం పోలైన ఓట్లు 2,45,687 ఓట్లు కాగా.. ఇందులో 2,26,448 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. అంటే.. 19,239 ఓట్లు చెల్లకపోవటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

మొదటి ప్రాధాన్యత ఓట్లు పదకొండు రౌండ్లలో ఓట్లలెక్కింపు జరగ్గా.. పది.. పదకొండు రౌండ్లు పూర్తి అయ్యేసరికి వైసీపీ అభ్యర్థికి 1820 ఓట్ల అధిక్యత మాత్రమే లభించింది. చివరి రెండు రౌండ్లలో కేవలం 407 ఓట్ల అధిక్యత లభించటంతో.. తుదిఫలితం ఉత్కంటకు తెర తీసింది. అధికారులు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి శనివారం సాయంత్రం వరకు పట్టొచ్చని చెబుతున్నారు. సో.. ఈ ఓట్ల లెక్కింపు నరాలు తెగే ఉత్కంట పోరును అందించే టెస్టు మ్యాచ్ కింద మారిందని చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.