Begin typing your search above and press return to search.

సంపన్నుల చూపంతా దుబాయ్ వైపే.. ఇళ్లు భారీగా కొనేస్తున్నారట

By:  Tupaki Desk   |   6 Feb 2023 10:14 AM GMT
సంపన్నుల చూపంతా దుబాయ్ వైపే.. ఇళ్లు భారీగా కొనేస్తున్నారట
X
డబ్బులున్నోళ్ల లెక్కలు వేరుగా ఉంటాయి. తాజాగా బయటకు వచ్చిన వివరాల్ని చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. మనదేశంలోని సంపన్నులు.. బడా బాబులు ఇప్పుడు దుబాయ్ లో ఇళ్లు కొనేందుకు క్యూ కడుతున్నారట. అక్కడ ఇళ్లు కొనటం అన్నది స్టేటస్ సింబల్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. ఖరీదు సంగతి పక్కన పెడదాం.. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద ఇల్లు ఉంటే ఆ లెక్కనే వేరు అన్నట్లుగా పలువురి తీరు మారినట్లుగా చెబుతున్నారు.

ఈ ట్రెండ్ కు తగ్గట్లే తాజా గణాంకాలు ఉన్నాయని చెప్పాలి. 2022 ఒక్క ఏడాదిలో దేశీయ పారిశ్రామికవేత్తలు పలువురు.. సంపన్నులు కలిసి దుబాయ్ లో ఇళ్ల కొనుగోలు కోసం ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.35,500 కోట్లుగా చెబుతున్నారు. అదే దుబాయ్ కరెన్సీలో చెప్పాలంటే 16 బిలియన్ దిర్హామ్ లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే కేవలం 9 బిలియన్ దిర్హామ్ లే కాగా.. ఇప్పుడు అందుకు భిన్నంగా విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయటం ఒక ట్రెండ్ గా మారింది.

దుబాయ్ లో భారతీయులు కొంటున్న ఇళ్ల విలువ రూ.3.60 కోట్ల నుంచి రూ.4 కోట్ల మధ్యన ఉంటుందని చెబుతున్నారు. ఈ ఇళ్లను అద్దెకు ఇచ్చినా.. నెలకు రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షలవరకు వస్తుందని.. అందుకే పలువురు సంపన్నులు దుబాయ్ లో ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లుగా చెబుతున్నారు. దుబాయ్ లోని ఇళ్ల అమ్మకాల్లో దాదాపు 20 శాతం వరకు భారతీయులే అన్న విషయాన్ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే దుబాయ్ లో ఇళ్లు కొనుగోలు చేసిన విదేశీయుల్లో భారతీయుల వాటా ఏకంగా 40 శాతానికి ఉండటం గమనార్హం. ఇలా ఇళ్లను కొనుగోలు చేస్తున్న భారతీయుల్లో అత్యధికంగా హైదరాబాద్.. ఢిల్లీ.. గుజరాత్..పంజాబ్ కు చెందిన వారే అధిమంటున్నారు. కొవిడ్ కు ముందు దుబాయ్ లో రియాల్టీ వ్యాపారం ఒక రేంజ్ లో ఉండేది. మహమ్మారి దెబ్బకు అక్కడి రియాల్టీ దెబ్బ తింది. ఇప్పుడు మళ్లీ కరెక్షన్ దాటేసినట్లుగా చెబుతున్నారు.

గత ఏడాది గోల్డెన్ వీసా ప్రోగ్రాం పరిధిని విస్తరించటంతో దుబాయ్ లో ఇంటిపైన పెట్టుబడి పెట్టొచ్చన్న నమ్మకం భారతీయుల మీద పెరిగిందని.. ఇది కూడా అక్కడి ఆస్తులు కొనుగోలు చేయటానికి అవకాశాల్ని పెంచుతుందన్న మాట వినిపిస్తోంది.

నిజానికి ఇవాల్టి రోజున హైదరాబాద్ మహానగరంలో లగ్జరీ విల్లా కావాలంటే రూ.5-6 కోట్లకు పైనే ఉంది. ఆ లెక్కన చూసినా దుబాయ్ లో ఇల్లు మరింత చౌకగా చెబుతున్నారు. దీనికి తోడు.. అద్దెకు ఇచ్చినా ఆదాయం మంచిగా రావటం కూడా పెట్టుబడి పెట్టే వారి సంఖ్యను పెంచుతుందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.