Begin typing your search above and press return to search.

ఇంతకీ తబ్లిగి జమాత్ అంటే ఏమిటి? ఢిల్లీలో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   1 April 2020 5:15 AM GMT
ఇంతకీ తబ్లిగి జమాత్ అంటే ఏమిటి? ఢిల్లీలో ఏం జరిగింది?
X
కరోనా వేళ.. దేశంలోకి వచ్చే విదేశీయుల్ని క్రమపద్దతిలో కట్టడి చేయటం ద్వారా కరోనా మీద విజయం సాధించినట్లుగా భావిస్తున్న కేంద్రానికి.. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు ఊహించని రీతిలో దెబ్బేసింది ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక అధ్యాత్మిక కార్యక్రమం. లాక్ డౌన్ లాంటి అసాధారణ నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటే.. దాన్ని తూచా తప్పకుండా రాష్ట్రాలు పాటిస్తున్నాయి. పాజిటివ్ కేసుల నమోదు తగ్గి.. మరణాల సంఖ్య కనిష్ఠంగా ఉన్నాయని భావిస్తున్న వేళ.. కరోనా కొత్త కేసులు.. మరణాలు అన్ని ఢిల్లీలో నిర్వహించిన మత కార్యక్రమానికి హాజరైన వారే ఇప్పుడు కరోనా వాహకాలుగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళనను రేకెత్తించింది.

గడిచిన రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారికి సంబంధించిన కేసులు బయటకు రావటంతో ఉలిక్కి పడిన కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. వెంటనే.. ఆరా తీయటం మొదలెట్టి.. ఈ కార్యక్రమానికి హాజరైన వారు ఎంతమంది? వారు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? వారి తాజా పరిస్థితి ఏమిటి? లాంటి అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అదే సమయంలో.. ఈ మత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తబ్లిగి జమాత్ అనే సంస్థ. ఈ సంస్థ అసలేం చేస్తుంది? వీరి కార్యకలాపాలు ఏవిధంగా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ తబ్లిగ్ అంటే ఏమిటన్న ప్రాథమికమైన ప్రశ్నకు సమాధానం.. అల్లా మాటల్ని బోధించటంగా చెబుతారు. జమాత్ అంటే సంస్థగా అభివర్ణించారు. అంటే.. అల్లా మాటల్ని బోధించే సమూహంగా దీన్ని చెప్పాలి. ప్రతి ఏటా ఒక భారీ మత ప్రార్థనల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది ఈ సంస్థ. ప్రతి ఏటా భోపాల్ లో నిర్వహించే ప్రోగ్రాంకు లక్ష మంది వరకూ హాజరవుతారని చెబుతున్నారు

ఢిల్లీ.. మహారాష్ట్రాల్లో ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఈ భారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ఏడాది ముందే ప్రకటిస్తారు. వీటిల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ఎక్కువమంది హాజరవుతారు. ఈసారి నిజాముద్దీన్ మర్కజ్ లో ప్రార్థనలు నిర్వహించారు. భారత్ లోని అన్ని రాష్ట్రాలతోపాటు.. ఇండోనేషియా.. మలేషియా తదితర దేశాల నుంచి పలువురు హాజరయ్యారు. 1927లొ హర్యానాలోని మేవాట్ ప్రారంభమైన ఈ సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం మత బోధనలు.. ప్రచారం చేయటమే లక్ష్యమంటారు. మైలానా ఇలియాస్ కాంద్లావి దీని వ్యవస్థాపకుడిగా చెబుతారు. 213 దేశాల్లో ఈ సంస్థ విస్తరించిందని.. ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల మంది దీన్ని ఫాలో అవుతారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సంస్థ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వీటిల్లో నిజం ఎంత అన్నది ప్రశ్న. 2011లో వికిలీక్స్ చేసిన సంచలన ఆరోపణల్లో తబ్లిగి జమాత్ మీదా కొన్ని ఆరోపణలు చేసింది. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా తో దీనికి సంబంధం ఉందన్న ఆరోపణలు చేశారు. అయితే.. ఇందులో నిజం లేదని.. ఈ సంస్థ ఖండించింది.