Begin typing your search above and press return to search.

కరోనా విషాదం: అందరూపోయి.. ఈ బాలుడే మిగిలి..

By:  Tupaki Desk   |   20 Jun 2021 11:43 AM GMT
కరోనా విషాదం: అందరూపోయి.. ఈ బాలుడే మిగిలి..
X
కరోనా.. కదిలిస్తే ఎన్నో విషాద గీతాలను ఆలపించేలా చేస్తోంది. కరోనా కుటుంబాలకు కుటుంబాలనే బలితీసుకున్న దారుణాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో కరోనా విషాదాన్ని నింపింది. కుటుంబంలోని ఐదుగురిని బలితీసుకుంది. చివరకు ఆ కుటుంబంలో 13 ఏళ్ల బాలుడు మాత్రమే మిగిలిన దైన్యం కనిపించింది.

కన్న తల్లిదండ్రులతోపాటు అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ కూడా కరోనాతో చనిపోవడంతో ‘సాయిసత్య సహర్ష’ అనే 13 ఏళ్ల కుర్రాడు మాత్రమే మిగిలాడు. ఆ బాలుడి కథ వింటేనే కన్నీరు వస్తున్న దీన స్థితి నెలకొంది.

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం హైవే సమీపంలోని బ్రిడ్జి కౌంటీలోని ఓ విల్లాలో మేడిచర్ల సుధీర్ రాయల్, శ్వేత హరిత నివాసం ఉంటున్నారు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు సాయిసత్య సహర్ష రాజమండ్రిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా తండ్రి సుధీర్ రాయల్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 24న మరణించాడు. . ఆ తర్వాత బాలుడి తల్లి శ్వేత మే 9న ఇదే కరోనాతో తుది శ్వాసవిడిచింది. బాలుడి నానమ్మ కూడా కరోనాతో బలైంది.

ఇక రాజోలులో ఉండే బాలుడి అమ్మమ్మ, తాతయ్య కూడా కరోనా బారిన పడి కాకినాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఆ బాలుడికి కేవలం మామయ్య మాత్రమే మిగిలాడు. అందరూ చనిపోయినా ఆ విషయం బాలుడు సాయిసత్యకు తెలియదు. బంధువులతో కలిసి ఈ నిజాన్ని చెప్పాలనుకుంటున్నారట.. అమ్మనాన్న ఏరి అంటే ఏదో చెప్పి సర్ది చెబుతున్న దైన్యం కనిపిస్తోంది.

అందరినీ కోల్పోయి భిక్కుభిక్కుగా అమాయకంగా ఉంటున్న బాలుడిని తాజాగా రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ శనివారం పరామర్శించాడు. బాలుడిని కేంద్రీయ విద్యాలయంలో చేర్పిస్తానన్నారు. బాలుడి తల్లిదండ్రుల చికిత్సకు 28 లక్షలు అయ్యాయని ఎంపీకి బాలుడి మామయ్య చెప్పుకొచ్చాడు. వాటిని తిరిగి ఇప్పించడంతోపాటు ప్రభుత్వ పరంగా సాయం చేస్తానని ఎంపీ భరత్ రామ్ హామీ ఇచ్చారు.