Begin typing your search above and press return to search.

అమెరికాలో మళ్లీ కరోనా కలకలం..రోజూ వేలల్లో మరణాలు!

By:  Tupaki Desk   |   24 Sept 2021 9:00 AM IST
అమెరికాలో మళ్లీ కరోనా కలకలం..రోజూ వేలల్లో మరణాలు!
X
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి అలజడి మరోసారి ఆందోళనకి గురి చేస్తుంది. కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, నిత్యం లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయని అమెరికా ఆరోగ్య శాఖ తెలిపింది.

కరోనా మహమ్మారి తో బుధవారం ఒక్కరోజే రెండు వేలమంది కంటే ఎక్కువ మంది మరణించినట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. గడిచిన వారంలో ప్రతిరోజూ సగటున 2,012 మంది మృతిచెందినట్లు తెలిపింది. కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో రోజుకి రెండు లక్షలకి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న కోవిడ్ నిబంధనలతో కాస్త కట్టడి పడింది. మళ్లీ లాక్‌డౌన్ ఎత్తివేత, జనజీవనం సాధారణస్థితికి చేరడంతో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా రెండు లక్షల మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అయితే, కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి.

గురువారం ఉదయం జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ దేశంలో ప్రస్తుత కేసులు మరియు మరణాల సంఖ్య వరుసగా 42,539,373 మరియు 681,111 గా ఉన్నట్లు వెల్లడించింది. అయితే, డెల్టా వేరియంట్‌ కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్‌ బారిన పడుతున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) వెల్లడించింది. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా హాస్పిటల్స్‌ల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి, ఆగస్టు చివరి వారంలో నాలుగు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అత్యధిక సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సీడీసీ తెలిపింది.