Begin typing your search above and press return to search.

గాంధీ దేవుళ్లకు అండగా ఉన్నామన్న మెసేజ్ ఎవరికి వారు ఇవ్వాల్సిందే

By:  Tupaki Desk   |   3 April 2020 2:30 AM GMT
గాంధీ దేవుళ్లకు అండగా ఉన్నామన్న మెసేజ్ ఎవరికి వారు ఇవ్వాల్సిందే
X
కరోనాకు మందు లేదు. కానీ.. పోయే ప్రాణాల్ని తమకేం సంబంధం లేనట్లుగా వదిలేయకుండా.. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ వైద్యం చేస్తున్నారు వైద్యులు. మిగిలిన సందర్భాల్లో వైద్యం చేయటం ఒక ఎత్తు.. కరోనా లాంటి డేంజరస్ వైరస్ ను డీల్ చేయటం వేరు. కరోనా పాజిటివ్ కేసుల్ని వైద్యం చేసే వేళలో.. వైద్యులకు.. వైద్య సిబ్బందికి ఉండే ముప్పు ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మనకు మాదిరి వారికి పెళ్లాం పిల్లలే కాదు.. కటుుంబాలు కూడా ఉన్నాయి. మనలోని చాలామంది మాదిరి.. సేఫ్ గేమ్ ఆడాలన్న నిర్ణయం తీసుకొని.. తాము విధులకు రాలేమన్న మాటను చెబితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? కరోనా వేళ అత్యవసర సేవలు అందించాల్సిన వారిలో కొందరు.. తమ కోసం..తమవారి క్షేమం కోసం.. దేనికైనా సిద్ధమన్నట్లుగా.. విధులకు హాజరు కాలేమన్న మాటను మొహమాటం లేకుండా చెప్పేసే వారంతా.. గాంధీలోనూ.. చెస్టు ఆసుపత్రిలోనూ కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వారిని గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

అలాంటి వారు కంటికి కనిపించని దేవుడి కంటే గొప్పవాళ్లు అన్నది మర్చిపోకూడదు. అందుకు భిన్నంగా.. తమ కుటుంబ సభ్యుడు ఒకరు మరణించిన దానికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దాడి చేయటం అమానుషమైతే.. ఇలాంటి దారుణాలపై స్పందించాల్సిన సమయం వచ్చేసింది.

ఇవాల్టి రోజున వైద్యులు.. వైద్య సిబ్బంది కరోనా రోగుల్ని చూడమని నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది? ఆలోచించటానికి సైతం ఇష్టపడం. మరి.. అలాంటప్పుడు అమానుష రీతిలో.. వైద్యుల మీదా వైద్య సిబ్బంది మీద దాడి చేసిన వారి తీరును ఖండించటం ఎంత ముఖ్యమో.. బాధితులుగా మారిన గాంధీ వైద్యులు.. సిబ్బందికి అండగా నిలవటం.. వారందరికి నైతిక స్థైర్యాన్ని పంచటం చాలా అవసరం. దీనికోసం ప్రత్యేకంగా రోడ్ల మీదకు రావాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు తమ ఇళ్లల్లోనే ఉంటూ.. వారికి దన్నుగా ఉన్నామన్న సందేశాన్ని పంపాల్సిన అవసరం ఉంది. అంతేకాదు. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి.. ప్రభుత్వ అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేవుడి సాయం తీసుకోవటమే కాదు.. కొన్ని సందర్భాల్లో దేవుళ్లకు దన్నుగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నది మర్చిపోకూడదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది సుమా.