తిరుమలేశుడిని వదలని మహమ్మారి: టీటీడీలో 91 మందికి పాజిటివ్

Sun Jul 12 2020 18:40:00 GMT+0530 (IST)

Corona positive for 91 people in TTD

మహమ్మారి వైరస్ ఎవరినీ వదలడం లేదు. చివరకు తిరుమలేశుడి సన్నిధిలో కూడా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైరస్ వేగంగా ప్రబలుతోంది. ఏకంగా 91 మంది టీటీడీ సిబ్బందికి పాజిటివ్ తేలిందని అధికారులు ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమం అనంతరం టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు.జూన్ 10 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించిన తర్వాత.. రోజుకు సగటున 10 వేల మంది దర్శించుకుంటున్నారని వివరించారు. అయితే టీటీడీలో ప్రబలుతున్న వైరస్ విషయమై స్పందించారు. కల్యాణకట్టలో ఇంతవరకూ ఎవరూ వైరస్ బారినపడలేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ తర్వాత ఇప్పటివరకు 82 520 మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు.

ఇప్పటివరకు 634 భక్తులకు వైరస్ పరీక్షలను నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ నిర్ధారణ కాలేదని ఈఓ తెలిపారు. అయితే టీటీడీ సిబ్బందిలో మొత్తం 91 మందికి వైరస్ నిర్ధారణ అయ్యిందని ప్రకటించారు. అలిపిరి వద్ద 1704 మంది తిరుమలలో 1865 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా ఆ కేసులు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.