Begin typing your search above and press return to search.

ఆశ్చ‌ర్యంః తెలుగు వారి డీఎన్ ఏ ను ఢీ కొట్టలేక పోతున్న క‌రోనా...తేల్చిన‌ శాస్త్రవేత్తలు!

By:  Tupaki Desk   |   23 Feb 2021 8:30 AM GMT
ఆశ్చ‌ర్యంః తెలుగు వారి డీఎన్ ఏ  ను ఢీ కొట్టలేక  పోతున్న క‌రోనా...తేల్చిన‌ శాస్త్రవేత్తలు!
X
దేశంలో క‌రోనా కేసులు కోటి దాటిపోయాయి.. మ‌హారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ఇంకా కొవిడ్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం క‌రోనా ప్ర‌భావం సాధార‌ణ స్థాయిలోనే ఉంది. ఇప్పుడే కాదు.. మొద‌టి నుంచీ ఇక్క‌డ కేసులు మిగ‌తా రాష్ట్రాల‌క‌న్నా త‌క్కువ‌గానే న‌మోద‌య్యాయి. దీని కార‌ణం ఏంటో తేల్చారు శాస్త్ర‌వేత్త‌లు. కొవిడ్‌-19 ఎదుర్కొనే కెపాసిటీ మ‌న దేహానికే ఉంద‌ని చెప్పారు.

ప్ర‌పంచం మొత్తాన్ని ప‌రిశీలించిన‌ప్పుడు మెడిక‌ల్ ఫెసిలిటీస్ త‌క్కువ‌గా భార‌త‌దేశంలో మ‌ర‌ణాల శాతం త‌క్కువ‌గా ఉంది. అంతేకాదు.. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో చాలా వ‌ర‌కు తేలికపాటి ఇన్ఫెక్షన్లు క‌లిగించేవే ఉన్నాయి. దీంతో ఇండియా స్పెషాలిటీ ఏంట‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో శాస్త్ర‌వేత్త‌లు ప‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు. ఫైన‌ల్ గా రిపోర్టు కూడా ఇచ్చారు. దాని ప్ర‌కారం. భార‌త్ లో కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ తీవ్రరూపు దాల్చకుండా.. సగం మందికిపైగా భారతీయులకు రక్షణ కవచంగా నిలుస్తున్న అంశం వారి ఒంట్లోనే ఉంద‌ని చెప్పేశారు.

‘నియాండెర్తల్‌..’ పురాతన ఆదిమానవుల జాతిలో ఇది ఒకటి. ఈ జాతి డీఎన్ ఏ ఎంతో అద్భుత‌మైన‌ది. ప్ర‌మాద‌క‌ర‌మైన ఎన్నో వ్యాధుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే కెపాసిటీ దీని సొంతం. అలాంటి నియాండెర్తల్ జాతి డీఎన్ ఏ ఇప్పుడు దాదాపు స‌గం మంది భార‌తీయుల్లో ఉంది. ఆదిమానవుల నుంచి ఈ డీఎన్ ఏ సుమారు 40వేల ఏళ్ల క్రితం భారతీయుల‌కు సంక్ర‌మించింద‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జపాన్‌లోని ఒకినావా ఇన్‌స్టిట్యూట్‌, జర్మనీలోని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో ఇది వెల్లడైంది. మ‌నిషి శరీరంలో 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి. భారతీయుల్లోని ‘క్రోమోజోమ్‌ 12’పై 75వేల క్యారెక్టర్ల పొడవైన డీఎన్‌ఏ సీక్వెన్స్‌ ఉందని ప‌రిశోధ‌కులు చెప్పారు. ఈ డీఎన్ ఏ ఉన్న‌వారు కొవిడ్‌ బారినపడినా.. తీవ్ర‌స్థాయిలో ప్ర‌భావం చూపే అవ‌కాశాలు కేవ‌లం 22 శాతం మాత్ర‌మే ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

చైనాలో ఉద్భ‌వించిన కొవిడ్‌-19 ప్ర‌పంచం మొత్తాన్ని అల్ల‌క‌ల్లోలం చేసింది. ఆ త‌ర్వాత బ్రిట‌న్ లో వెలుగుచూసిన క‌రోనా స్ట్రెయిన్ కూడా దేశాల‌ను ఛిన్నాభిన్నం చేసింది. ఇప్ప‌టికీ త‌న ప్ర‌భావం కొన‌సాగిస్తోంది. అంతేకాదు.. వివిధ దేశాల్లో స‌రికొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కానీ.. భార‌త్ లో మాత్రం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. దీనంత‌టికీ కార‌ణం నియాండెర్తల్ డీఎన్ ఏనే అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

ఈ త‌ర‌హా డీఎన్ ఏ తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌ల్లో దాదాపు 48 శాతం మందిలో ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇక గుజరాతీల్లో ఈ శాతం 49.5గా ఉంద‌ని చెబుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ చాలా మందిలో నియాండెర్త‌ల్ జన్యుక్ర‌మం ఉంద‌ని, ఆ కార‌ణంగానే క‌రోనా మ‌న దేశంలో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ట్లేద‌ని చెబుతున్నారు. కొంత‌మందికి క‌రోనా వ్యాపించినా.. వేగంగా కోలుకోవ‌డానికి కూడా కార‌ణం ఇదేన‌ని చెబుతున్నారు.