Begin typing your search above and press return to search.

ఐపీఎల్ కు కరోనా దెబ్బ.. ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లకు పాజిటివ్

By:  Tupaki Desk   |   3 May 2021 10:34 AM GMT
ఐపీఎల్ కు కరోనా దెబ్బ.. ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లకు పాజిటివ్
X
అంతా అనుకున్నట్టు అయ్యింది. ఐపీఎల్ పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన ఇద్దరూ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఇవాళ జరగాల్సిన మ్యాచ్ ను వాయిదా వేశారు. ఈరోజు 7:30 గంటలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. రెగ్యులర్ గా ఆటగాళ్లకు నిర్వహిస్తున్నట్లు గానే పరీక్షలు నిర్వహించగా కేకేఆర్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారిద్దరే కాదు జట్టులోని కొంత మంది ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో జట్టు యాజమాన్యం ముందస్తు జాగ్రత్తగా అందరూ ఆటగాళ్లను ఐసోలేషన్ లోకి పంపింది.

ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైన కొద్ది రోజులకే దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు నాలుగు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. భారత్ లో నెలకొన్న పరిస్థితులపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఐపీఎల్ లో ఆడుతున్న వివిధ దేశాల ఆటగాళ్లను స్వదేశాలకు తిరిగి రావాలని ఆయా దేశాలు కోరడం జరిగింది. దీంతో ఇప్పటికే కొంత మంది ఆటగాళ్లు టోర్నీని వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు.
ఇండియన్ క్రికెటర్ అశ్విన్ కూడా కరోనా కారణంగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగారు.

కరోనా కేసులు రోజు ఇంతలా నమోదవుతున్నా ఐపీఎల్ నిర్వహించడంపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే ఐపీఎల్ యాజమాన్యం మాత్రం ఆటగాళ్లను పూర్తిగా బయో బబుల్ వాతావరణంలో ఉంచి టోర్నీ నిర్వహిస్తున్నామని, ఆటగాళ్లకు కరోనా ఎఫెక్ట్ ఉండదని చెబుతూ వచ్చింది. ఇదిలా ఉండగా ఇవాళ జరగాల్సిన మ్యాచ్ ను వాయిదా వేసినట్లు బీసీసీఐ కి చెందిన ఒక అధికారి వెల్లడించారు.

ఐపీఎల్ యాజమాన్యం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఆటగాళ్లను బయో బబుల్ లో ఉంచి టోర్నమెంట్ నిర్వహిస్తున్నప్పటికీ కోల్ కతా జట్టు కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారినపడటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ముందు ముందు మరి కొంత మంది ఆటగాళ్లు కరోనా బారిన పడితే టోర్నీ నిర్వహణకూడా ఆగి పోవాల్సి వస్తుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఇవాళ జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడడంతో షెడ్యూల్ మార్చి మళ్లీ నిర్వహించే అవకాశం ఉంది.