Begin typing your search above and press return to search.

నాడు కేసుల్లో జీరో .. నేడు కరోనాకి హాట్ స్పాట్ ఆ జిల్లా !

By:  Tupaki Desk   |   22 April 2021 11:30 PM GMT
నాడు కేసుల్లో జీరో  .. నేడు కరోనాకి హాట్ స్పాట్ ఆ జిల్లా !
X
కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో భయాందోళనలు నెలకొన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,14,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో చెప్పకనే చెబుతోంది. కరోనా కేసులే కాదు మరణాలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా భారత్‌లో 2,104 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకి మళ్లీ పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఏపీలో కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది. ముఖ్యంగా ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు ఇపుడు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే నమోదు కావడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని రోజుకు వేయి కేసులు దాటిన జిల్లాలు నాలుగైదు ఉంటే ఏకంగా రోజుకు 1500 పై చిలుకు కేసులు శ్రీకాకుళం జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. విజయనగరంలో 500 కేసులు ఉంటే మహా విశాఖలో800 కేసులు మాత్రమే ఉన్నాయి. మరి ఉన్న ఫళంగా ఇంత భారీగా కేసులు శ్రీకాకుళం జిల్లాలోనే నమోదు కావడం వెనక కారణం ఏంటి అన్న చర్చ విపరీతంగా జరుగుతుంది.

అయితే వలసల జిల్లాగా పేరు పొందిన శ్రీకాకుళంలో కేసులు ఇలా వీరవిహారం చేయడానికి అన్ని ప్రాంతాల నుంచి వలస కూలీలు సొంత జిల్లాకు చేరుకోవడమే అంటున్నారు. ముఖ్యంగా ముంబై నుంచి వచ్చే వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. శ్రీకాకుళంలో అంతకంతకు పెరుగుతున్న కేసులను చూస్తే కరోనా హాట్ స్పాట్ గా ఈ జిల్లా మారుతుందా అన్న ఆందోళన కూడా అధికారుల్లో ఉంది. మరో విషయం ఏమిటంటే...గత ఏడాది కరోనా మొదటి దశలో కొన్నాళ్ళ వరకూ కరోనా కేసుల్లో జీరో నంబర్ గా ఈ జిల్లా ఉంది. అయితే సెకండ్ వేవ్ లో మాత్రం శ్రీకాకుళం లో వేగంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.