కరోనా జగన్ కి అలా కలిసొచ్చింది!

Tue Sep 29 2020 21:00:33 GMT+0530 (IST)

Corona Helps To Ap Government

ఏపీలో సీఎం జగన్ 15 నెలల పాలనలో ధరల పెంపుపై చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కరెంట్ చార్జీలు ఆర్టీసీ చార్జీలు పెట్రోల్ డీజిల్ మద్యం రిజిస్ట్రేషన్ భూముల ధరలు పెంచారు. తాజాగా నిత్యావసర సరుకులు ధరలు కూడా మండిపోతున్నాయి. మరోవైపు కేంద్రం కూడా పెట్రోలు డీజిల్ ధరలు పెంచుతూ …వంటగ్యాస్ పై సబ్సిడీ తగ్గిస్తోంది. వాస్తవానికి ఇటువంటి పరిస్థితుల్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వం....అటు కేంద్ర ప్రభుత్వంపై ఏపీలోని విపక్షాలు ధర్నాలు రాస్తారోకోలు ఆందోళనలు చేసి తమ నిరసన తెలపాలి. కానీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు ప్రత్యక్ష నిరసనలు తీవ్రస్థాయిలో చేయడం లేదు వామపక్ష పార్టీల నేతలు కొందరు పరిమిత సంఖ్యలో రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా... ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బీజేపీ జనసేనలు పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.అయితే కరోనా నేపథ్యంలోనే ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాలు చేసే పరిస్థితి లేదని అందుకే ఆన్ లైైన్ లోనే నిరసనలు....పత్రికా ప్రకటనలు ప్రెస్ మీట్లతోనే విపక్షాలు సరిపెట్టుకుంటున్నాయి. వాస్తవానికి ఆయా విషయాల్లో ప్రత్యక్ష నిరసన తెలిపే అవకాశమున్నప్పటికీ....కోవిడ్ నిబంధనల వల్ల రాస్తారోకో ధర్నా వంటి కార్యక్రమాలు చేసే అవకాశం లేదు. అరకొరగా కొందరు నేతలు రోడ్లపైకి వచ్చినా....వారికి ప్రజలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపి దానిని ఓ ప్రజా ఉద్యమంలా మలిచే పరిస్థితులు లేవన్నది వాస్తవం. ఈ రకంగా గత 8 నెలల కాలంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు ఊపిరి పోసుకోలేదని చెప్పవచ్చు. జనాలు రోడ్లెక్కడం లేదని....విపక్షాలు పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారని...ప్రభుత్వం ప్రజావ్యతిరేకత లేదనుకోవడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ఉద్యమాలను కరోనా   నలిపేసిందని కరోనా సద్దుమణిగాక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయని అంటున్నారు.  ఆ విషయంలో `కరోనా`నే ప్రభుత్వాలకు శ్రీరామ రక్ష అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.