ఈ వృద్ధ దంపతుల ధైర్యం ముందు కరోనా బలాదూర్

Mon May 10 2021 07:00:01 GMT+0530 (IST)

Corona Baladur before the courage of this elderly couple

కరోనా... పేరు వింటేనే జనం హడలెత్తిపోతున్నారు. ప్రాంతం కులం మతం వర్ణం అన్న తేడాలతో పాటు వయసు తేడా కూడా ఈ విషయంలో పని చేయట్లేదనే చెప్పాలి. కరోనా తొలి వేవ్ కంటే ఇప్పుడు ఎంట్రీ ఙచ్చిన సెకండ్ వేవ్ చూస్తుంటే... జనం నిజంగానే హడలెత్తిపోతున్నారు. ప్రభుత్వ కట్టడి చర్యలతో సంబంధం లేకుండానే ఎవరికి వారే స్వీయ నియంత్రణ చర్యలు తీసుకుంటున్న వైనమే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు. ఇలాంటి తరుణంలో ప్రాణాలను ఇట్టే హరించేసుకుని వెళుతున్న కరోనాను జయించి... దాని నుంచి తమ ప్రాణాలను రక్షించుకోవడంతో పాటుగా... కరోనాను ఎలా జయించాలో యావత్తు ప్రపంచానికి తెలిసేలా చేసింది ఓ వృద్ద జంట. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన ఈ వృద్ధ దంపతుల ధీరోదాత్త గాధ నిజంగానే యావత్తు మానవాళికి ఆదర్శమనే చెప్పాలి.శ్రీకాకుళం పట్టణానికి చెందిన యస్.వి.అర్.ఎం. పట్నాయక్ కమల దంపతుల వయసు డెబ్బై దాటే ఉంటుంది. వీరిలో ఒకరు కేన్సర్ తో బాధపడుతోంటే... మరొకరేమో గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఇలాంటి వీరికి కరోనా సోకితే... ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే అనుకున్నంతా అయ్యింది. ఈ ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. అయితే అందరిలా వీరు కరోనాను చూసి ఎంతమాత్రం భయపడలేదు. కరోనా పేరు చెబితేనే హడలెత్తిపోతున్న యావత్తు జనానికి ఆదర్శంగా నిలిచి గెలిచారు. తమకు సోకిన కరోనాను వారు ఒక మామూలు జ్వరంగానే భావించారు. తమకు కరోనా ఉందన్న ఊసే మరచారు. డాక్టర్లు చెప్పిన ప్రకారం మందులు వాడారు.

డెబ్బై ఏళ్లకు పైబడ్డ వయసులో అది కూడా కేన్సర్ గుండె సంబంధిత వ్యాధులతో బాదపడుతున్న ఈ వృద్ధ దంపతుల ధైర్యాన్ని చూసి నిజంగానే కరోనా వైరస్ డంగైపోయిందనే చెప్పాలి. కరోనా సోకిన విషయం తెలిసి కూడా ఏమాత్రం భయాందోళనకు గురి కాకుండా... ఆసుపత్రుల వైపు చూడకుండా... తమకు తెలిసిన వైద్యుల సలహాల మేరకు మందులు వాడుతూ కరోనాను ఈ వృద్ధ జంట జయించేసింది. కరోనాను తమ శరీరాల నుంచి పారదోలిన వీరు.. భయపడకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చునని అందరికీ చెబుతున్నారు. అంటే... మనోధైర్యం ముందు ఎంతటి ప్రాణాంతక కరోనా అయినా బలాదూరేనన్న మాట.