Begin typing your search above and press return to search.

పసిబిడ్డ పాల కోసం ఆ పోలీసు అథ్లెట్ లా పరుగు తీశాడు

By:  Tupaki Desk   |   5 Jun 2020 5:00 AM GMT
పసిబిడ్డ పాల కోసం ఆ పోలీసు అథ్లెట్ లా పరుగు తీశాడు
X
ఒక పోలీసు దురహంకారానికి అమెరికా లాంటి అగ్రరాజ్యం అట్టుడికిపోతోంది. కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆగ్రహజ్వాలలకు అమెరికా అధ్యక్షుడు సైతం బంకర్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి. కట్ చేస్తే.. కేరళలోని ఒక గజరాజు విషయంలో అమానుషంగా వ్యవహరించిన తీరు.. దేశ వ్యాప్తంగా సానుభూతితో పాటు.. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆకలితో ఉన్న ఏనుగుకు అందించిన ఫైనాపిల్ లో బాంబు పెట్టి.. దాన్ని గాయపర్చటం.. అయినప్పటికీ తనను దెబ్బ తీసిన వారిని ఏమీ అనకుండా వెళ్లిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న తీరు అందరిని కదిలించి వేస్తోంది.

ఇలాంటివేళ.. మానవత్వం ఇంతగా తరిగిపోతుందన్న బాధ వ్యక్తమవుతున్న వేళ.. అందరూ ఒకేలా ఉండరు.. కొందరు చెడ్డవాళ్లు ఉండొచ్చు.. మంచోళ్లు కూడా చాలామందే ఉన్నారన్న నమ్మకం కలిగేలా మధ్యప్రదేశ్ లో ఒక ఉదంతం చోటుచేసుకుంది. తాజాగా వెలుగు చూసిన సీసీఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. భోపాల్ రైల్వేస్టేషన్ లో యూపీలోని గోరఖ్ పూర్ కు ఒక మహిళ వెళుతోంది. ఆమె వెంట నాలుగు నెలల చిన్నారి ప్రయాణిస్తోంది. తమ చంటిపాప పాల కోసం రైల్వే రక్షణ సిబ్బంది ఇందర్ యాదవ్ సాయం కోరారు. భోపాల్ స్టేషన్లో రైలు ఆగిన కాసేపట్లో పాలు తెచ్చే ప్రయత్నం చేశాడా పోలీసు. కానీ.. అప్పటికే రైలు కదిలింది. ఆ పాపకు పాలు అందించాలన్న తపనతో.. ఒక చేతిలో రైఫిల్.. మరో చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని యాదవ్ అథ్లెట్ మాదిరి పరిగెత్తి రైల్లో వెళుతున్న ఆ తల్లికి అందించాడు.

ఇదంతా అక్కడి సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది. తన ప్రయాణం ముగిసి ఇంటికి వెళ్లిన ఆ మహిళ.. పోలీసు చేసిన సాయాన్ని పేర్కొంటూ.. ఇందర్ యాదవ్ కు థ్యాంక్స్ చెప్పారు. తమ పసిపాపకు అంతకు ముందు నీళ్లలో ముంచి తినిపించాల్సి వచ్చిందని.. బిడ్డకు పాలు లేకపోవటంతో తాము చాలా అవస్థలకు గురైనట్లు పేర్కొన్నారు. తమకు ఇందర్ యాదవ్ హీరోగా ఆమె అభివర్ణించారు.

ఈ వీడియో వైరల్ కావటం.. సదరు పోలీసు కానిస్టేబుల్ తీరును ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఈ ఉదంతంపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. చిన్నారికి పాలు అందించటం కోసం రైలు వెంట పరిగెత్తి.. అద్భుతమైన పని తీరును ప్రదర్శించారన్న మంత్రి.. ఆయనకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన ఉదంతాల్ని చూసినప్పుడు.. మన చుట్టూ చెడ్డోళ్లు మాత్రమే కాదు.. మనసున్నోళ్లు కూడా ఉన్నారన్న భావన కలుగక మానదు.