ఇక హనుమంతుడి జన్మస్థలంపై వివాదం ముగిసినట్టేనా?

Mon Jun 27 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Controversy Over Hanuman Birthplace

ఆంజనేయ స్వామి జన్మస్థలం కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రే అనడానికి ఆధారాలు లభించాయా అంటే అవుననే అంటున్నారు. . కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్సింగ్. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖలు చేసిన పరిశోధనలు ఈ విషయాన్ని తేల్చాయని చెబుతున్నారు. కేంద్ర పురావస్తు శాఖ నివేదిక 15 రోజుల్లో వస్తుందని.. ఆ తర్వాత అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా ప్రకటిస్తామని ఆనంద్సింగ్ అంటున్నారు. కేంద్ర కర్ణాటక రాష్ట్ర పురావస్తు శాఖలు అంజనాద్రి కొండ రికార్డులను పరిశీలించాయని పేర్కొంటున్నారు. అందులో అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని తేలిందని చెబుతున్నారు. సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత అంజనాద్రిలో ఈ మేరకు అధికారికంగా బోర్డు పెట్టాలని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై సూచించారని అంటున్నారు. అంజనాద్రి కొండ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు కూడా విడుదల చేశారని పేర్కొంటున్నారు.మరోవైపు ఆంజనేయుడి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని అంజనాద్రి అని మధ్య భారతదేశంలోని చిత్రకూట్ పర్వతాలు అని మహారాష్ట్రలోని నాసిక్ అని.. ఇలా రకరకాలుగా వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంజనేయుడు తిరుమలలోని అంజనాద్రిలోనే జన్మించాడని.. ఇందుకు పలు చారిత్రక పురాణ ఆధారాలు ఉన్నాయని స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం హంపికి సమీపంలో ఉన్న కిష్కింద (అంజనాద్రి)లో ఆంజనేయ స్వామి జన్మించాడని కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పలు ఆధారాలు చూపుతోంది. కిష్కంద పేరుతో రామాయణంలో పేరు ఉందని రామాయణం జరిగిన తేత్రాయుగ కాలంలో రాముడు.. సీతను వెతుకుతూ కిష్కిందలో కొంతకాలం నివాసించాడని నొక్కి వక్కాణిస్తోంది. ఇప్పటికీ ఇక్కడ స్థానిక ప్రజలు పూర్వీకుల మాటల్లో స్థానిక గాథల్లో ఆంజనేయుడు కిష్కిందలోనే పుట్టాడనడానికి ఆధారాలు ఉన్నాయని చెబుతోంది.

ఆంజనేయుడి జన్మస్థలం ఏదో తేల్చడానికి జూన్ 1న నాసిక్లో ధర్మసంసద్ సమావేశం జరిగింది. ఈ ధర్మసంసద్కు దేశం నలుమూలల నుంచి సాధువులు సంత్లు హాజరయ్యారు. ఈ సమావేశం కూడా కర్ణాటకలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని తేల్చింది. ఇప్పుడు కేంద్ర పురావస్తు శాఖ కూడా ఇదే విషయాన్ని ప్రకటించనుండటంతో ఆంజనేయడి జన్మస్థలంపై ఇక వివాదాలు ముగిసినట్టే.

కాగా ఇటీవల అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించగా దీనిపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టులో ప్రస్తుతం ఈ వివాదం నడుస్తోంది. మరోవైపు అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం అని చూపడానికి టీటీడీ ఆధారాలు సంపాదిస్తోంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలో ఉన్న అంజనాద్రిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా టూరిజం కారిడార్గా తీర్చిదిద్డడానికి ఏర్పాట్లు చేస్తోంది.