Begin typing your search above and press return to search.

నిరాశలో కాంగ్రెస్ నేతలు

By:  Tupaki Desk   |   31 May 2023 11:01 AM GMT
నిరాశలో కాంగ్రెస్ నేతలు
X
తెలంగాణా కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన కాంగ్రెస్ కూడా పెద్దఎత్తున కార్యక్రమం చేయాలని డిసైడ్ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా సోనియా గాంధి లేకపోతే ప్రియాంక గాంధి వస్తారని అనుకున్నారు.

వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రావాలని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు చాలామంది సీనియర్లు కోరుకున్నారు. అయితే చివర కు వీళ్ళిద్దరు రావటంలేదని తేలిపోయింది. వీళ్ళకు బదులుగా లోక్ సభ కు స్పీకర్ గా పనిచేసిన మీరాకుమార్ వస్తున్నట్లు ఏఐసీసీ నుండి సమాచారం అందింది.

సోనియా, ప్రియాంక తో పోలిస్తే మీరాకుమార్ ఈ విషయంలో కూడా సరిపోరు. మీరాకు తెలంగాణా తో పెద్దగా బాండింగ్ లేదు. రాష్ట్ర విభజన జరిగి ప్రత్యేక తెలంగాణా ఏర్పడినపుడు స్పీకర్ గా మీరాకుమారే ఉన్నారన్న ఒక్క కారణం తప్ప ఇంకేమీలేదు. పార్టీ నేతలకే మీరాతో పెద్దగా సంబంధాలు లేవంటే ఇక మామూలు జనాల కు ఆమె ఏమి తెలుస్తారు ? అదే సోనియా, ప్రియాంక అంటే ఆ జోష్ వేరుగా ఉంటుంది. వీళ్ళగురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయటం చేయాల్సిన అవసరంలేదు.

జీవితకాలంలో సోనియా, ప్రియాంక ను దగ్గరనుండి ఒక్కసారి కూడా చూడని నేత కూడా వీళ్ళు వస్తున్నారంటే హుషారుగా మారిపోతారు. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ జరపాలని అనుకున్న కారణంకూడా ఇదే. సోనియా, ప్రియాంకల వల్లే ప్రత్యేక తెలంగాణా వచ్చిందని చెప్పుకోవాలన్నదే తెలంగాణా కాంగ్రెస్ వ్యూహం. కానీ ముందుగానే ఖరారైన షెడ్యూల్ కారణంగానే వీళ్ళిద్దరు తెలంగాణా కు హాజరుకావటంలేదని ఏఐసీసీ కార్యాలయం సమాచారం ఇచ్చింది.

ఈ ఏడాది చివరలో ఎన్నికల ను ఎదుర్కోబోతున్న రాజస్ధాన్, మధ్యప్రదేశ్ వ్యవహారాలతో వీళ్ళిద్దరు చాలా బిజీగా ఉన్నారు. తెలంగాణా కు కూడా ఈ ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే ఏదో కార్యక్రమం పేరుతో ప్రియాంక చాలాసార్లు తెలంగాణా లో పర్యటించారు. అనారోగ్యం కారణంగా సోనియా జనాల్లో కి పెద్దగా రావటంలేదు. అయితే ఉత్తరాధి రాష్ట్రాల కు ఉన్న ప్రత్యేక కారణంగా మధ్యప్రదేశ్, రాజస్ధాన్ నేతలతో భేటీ అవుతున్నారు. అందుకనే తెలంగాణా కు రాలేకపోతున్నట్లు చెప్పింది.