'కమలం' రెడ్లకు 'హస్తం' రెడ్డి అండ దొరికిందే!

Sat Aug 24 2019 21:49:49 GMT+0530 (IST)

Congress leader Ramalinga Reddy said BJP neglecting Reddy community by not giving minister post

ప్రస్తుత రాజకీయాల్లో కులం కార్డు - మతం కార్డు - సామాజిక కార్డు... ఇలా కార్డులన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఓట్ల షేర్ నుంచి - మంత్రివర్గంలో పదవుల దాకా కూడా ఈ కార్డులన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఈ కార్డుల గోల ఎంతదాకా వెళ్లిందంటే... ప్రత్యర్థి వర్గంలోని తన వర్గం నేతలకు పదవులు దక్కలేదంటూ వైరి వర్గంలోని నేతలు రచ్చకెక్కేదాకా. నిజమా? అంటే... నిజమే మరి. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కర్ణాటక రాజకీయంలో ఈ తరహా వాదన ఒకటి ఇప్పుడు మరోమారు అందరినీ కన్నడ రాజకీయాల వైపు మళ్లించింది.కర్ణాటకలో మొన్నటిదాకా పాలన సాగించిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో మంత్రిగా కొనసాగిన హస్తం పార్టీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి...  బీజేపీలోని తన సామాజిక వర్గానికి చెందిన నేతలకు జరిగిన అన్యాయంపై గళం విప్పారు. బెంగళూరులోని బీటీఎం లే అవుట్ ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి... అక్కడి రెడ్డి సామాజిక వర్గం తరఫున తనదైన శైలి సత్తా చాటుతున్నారు. ఈ విషయంలో ఆయన తన పార్టీ - ప్రత్యర్థి పార్టీ అన్న తేడా చూపించడం లేదు. ఇప్పుడు కర్ణాటకలో కొత్తగా అదికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. కర్ణాటక బీజేపీలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా 9 మంది రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలున్నారని - అయినా కూడా యడియూరప్ప కేబినెట్ లో ఒక్క రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కలేదని ఆయన కొత్త వాదన వినిపించారు.

కర్ణాటకలోని బాగల్  కోటేలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ తరహా కొత్త వాదన వినిపించారు. బీజేపీ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరిగిందని తనదైన శైలి ఆవేదనను వ్యక్తం చేసిన రామలింగారెడ్డి... త్వరలో జరుగుతుందని భావిస్తున్న యడ్డీ కేబినెట్ విస్తరణలో అయినా రెడ్డి సామాజిక వర్గానికి చోటు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా తన ప్రత్యర్థి పార్టీలో ఉన్న తన సామాజిక వర్గ నేతలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన రామలింగారెడ్డి... బీజేపీలోని రెడ్డి ఎమ్మెల్యేలకు బాసటగా నిలిచినట్టైందన్న వాదన వినిపిస్తోంది. మరి కమలం నేతలు రామలింగారెడ్డి వాదనను ఆలకించి... రెడ్లకు యడ్డీ కేబినెట్ లో చోటు కల్పిస్తారో - లేదో చూడాలి.