ఇంకా 12 సీట్లు గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం వస్తుందా?

Thu Jan 20 2022 13:40:00 GMT+0530 (IST)

Congress Target 12 Seats In Telangana

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకూ ఏకపక్షంగా ఉన్న రాజకీయాలు వచ్చే ఎన్నికల నాటికి కాస్తా త్రిముఖ పోరుగా మారుతాయని విశ్లేషకులు అంటున్నారు. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌కు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ నుంచి ప్రధాన పోటీ ఎదురవుతోంది. ఆ రెండు విపక్ష పార్టీలు రాష్ట్రంలో బలోపేతమయ్యే దిశగా సాగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుతో ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అదనంగా 12 సీట్లు గెలిస్తే చాలని తేలిందని అంటున్నారు.అక్కడ బలంగా..

ఆ సర్వే ప్రకారం దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఊపు మీద ఉందని అంటున్నారు. ఖమ్మం నల్గొండ రంగారెడ్డి మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీకి మంచి నాయకులు ఉన్నారు. మెదక్‌లో కూడా పార్టీకి బలం ఉందని చెబుతున్నారు. అంతే కాకుండా వరుసగా రెండు సార్లు కేసీఆర్ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నారని సర్వే పేర్కొందని సమాచారం. ఇక ఉత్తర తెలంగాణలో చూసుకుంటే అక్కడ టీఆర్ఎస్ బీజేపీ బలంగా ఉందని.. కానీ అక్కడ కూడా కాంగ్రెస్‌కు ఓటర్లు ఉన్నారని తెలుస్తోంది. అక్కడ మంచి నాయకులు ప్రజల్లోకి వెళ్తే పార్టీకి తప్పకుండా ఆదరణ దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. అక్కడ కూడా పార్టీ పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

48 చోట్ల..

ఒక సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ 48 చోట్ల గెలుస్తుందని అంటున్నారు. ఇక అధికారంలోకి రావాలంటే మరో 12 సీట్లు మాత్రమే కావాలని పార్టీ కష్టపడితే అదేం కష్టం కాదని చెబుతున్నారు. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఓ పార్టీకి 60 సీట్లు కావాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో 12 సీట్లు తెచ్చుకుంటే చాలాని సర్వే చెబుతోంది. సర్వే ప్రకారం ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని అంచనాలున్నాయి. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ను పార్టీలోని సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తునారన్నది తెలిసిన విషయమే.

తెలంగాణ ఇచ్చిన పార్టీకి ప్రజల అభిమానాన్ని సంపాదించడంలో విఫలమైన కాంగ్రెస్.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు. నాయకులు కలిసి కట్టుగా పార్టీ విజయం కోసం పని చేయాల్సి ఉంది. మరోవైపు ఓట్లు చీల్చడానికి సీఎం కేసీఆర్.. బీజేపీని హైలైట్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ బలపడితే కాంగ్రెస్‌కు పడే ఓట్లు చీలి టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది కేసీఆర్ అంచనాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరింత ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.