భార్య బాటలోనే టీ కాంగ్రెస్ దిగ్గజం....

Sun Aug 25 2019 07:00:01 GMT+0530 (IST)

Congress Senior Leader Follows His Wife Route

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలియదు అన్నట్లుగానే తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత- మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ రాజకీయ భవిష్యత్ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఒకప్పుడు భార్య బీజేపీలో చేరితే తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చిన దామోదర ఇప్పుడు అదే బీజేపీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. తాజాగా అమిత్ షాతో భేటీ అయిన ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకొనున్నారు.ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆయన 2014లో తెలంగాణలో ఆందోల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ తరుపున ఆందోల్ నుంచి మరోసారి బరిలోకి దిగారు. ఆ సమయంలో ఊహించని షాక్ ఇస్తూ దామోదర భార్య పద్మిని బీజేపీలో చేరింది. దామోదరకి తెలియకుండానే ఆమె నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్ళి కమలం కండువా కప్పుకుని వచ్చారు. దీంతో భార్య ఇచ్చిన షాక్ నుంచి వెంటనే తేరుకుని దామోదర తన బంధువుల ద్వారా పద్మినికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

భర్త ఒక పార్టీలో ఉండి భార్య పార్టీలో ఉంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పి పద్మిని చేత బలవంతంగా బీజేపీలోకి వెళ్ళడం లేదని కాంగ్రెస్ లోనే ఉంటున్నాని చెప్పించారు. చివరికి ఆమె కాంగ్రెస్ లోనే ఉంది. పొద్దున్న బీజేపీ కండువా కప్పుకున్న ఆమె సాయంత్రానికి తిరిగి కాంగ్రెస్ వండువా కప్పేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. కానీ ఎన్నికల్లో దామోదర మరోసారి ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. పార్టీలో యాక్టివ్ గా ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వీడుతారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం తగ్గట్టుగానే ఆయన భార్య బాటలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్ళిన ఆయన తాజాగా అమిత్ షాతో భేటీ అయ్యారు. త్వరలోనే బీజేపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కి భవిష్యత్ లేదనే దామోదర ఈ నిర్ణయం తీసుకున్నారు. పైకి పార్టీ మారనని చెబుతున్నా..త్వరలోనే బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అటు బీజేపీ కూడా తెలంగాణలో బలపడాలని చూస్తోంది. అందుకే దామోదర లాంటి నేతలనీ చేర్చుకుంటే పార్టీకి మంచిందని భావిస్తున్నారు. మొత్తం మీద భార్య చూపించిన బాటలోనే దామోదర రాజనరసింహ పయనిస్తున్నారు.