Begin typing your search above and press return to search.

మూడో విడత సగం స్థానాలపై కాంగ్రెస్ గట్టి ఆశలు!

By:  Tupaki Desk   |   23 April 2019 5:02 PM GMT
మూడో విడత సగం స్థానాలపై కాంగ్రెస్ గట్టి ఆశలు!
X
మూడో విడత ఎన్నికల పోలింగ్ జరిగిన నూటా పదిహేను ఎంపీ సీట్లలో సగం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఆశలు పెట్టుకున్న వైనం కనిపిస్తూ ఉంది. ఈ దఫా పోలింగ్ జరిగిన సీట్లలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉంది. కొన్ని చోట్ల బీజేపీతో - మరి కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ తలపడింది. వీటిల్లో చాలా చోట్ల తాము జెండా ఎగరేయగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు.

కర్ణాటకలో పోలింగ్ జరిగిన పద్నాలుగు - కేరళలో ఇరవై - గుజరాత్ లో ఇరవై ఆరు - చత్తీస్ గడ్ - మహారాష్ట్ర లోని ఎంపీ సీట్లపై కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది.

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బీజేపీతో తలపడింది. వీటిల్లో మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోరాటం సాగింది. ఇక కేరళలో కమ్యూనిస్టు పార్టీలకూ - కాంగ్రెస్ కు మధ్యన గట్టి పోటీ నెలకొంది. గుజరాత్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరు గట్టిగా సాగింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ - బీజేపీ అమీతుమీ పోరాడాయి. ఈ సారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వారు తామే మెజారిటీ ఎంపీ సీట్లను నెగ్గుతామనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇరు పార్టీలూ.

మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమి వర్సెస్ కాంగ్రెస్ పోరాటం గట్టిగా సాగిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. చత్తీస్ గడ్ లో ఇటీవలే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే స్థాయి విజయం సాధ్యం అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

ఇక మూడో విడతగా పోలింగ్ పూర్తి అయిన మిగతా ఎంపీ సీట్లలో కూడా చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పోరాటం సాగింది. విజయం పట్ల ఇరు పార్టీల్లో ఒకే స్థాయి ధీమా కనిపిస్తూ ఉంది!