బీజేపీ దెబ్బ.. అడవుల్లోకి పారిపోయిన కాంగ్రెస్ నేత.. ఎందుకంటే!

Mon Dec 05 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Congress Kanti Kharadi on bjp

రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు ప్రతివిమర్శలు కామన్. కానీ ఇటీవల కాలంలో బెదిరింపులు.. కూడా చోటు చేసుకుంటు న్నాయి. అయితే ప్రాంతీయ పార్టీలకు మాత్రమే పరిమితమైన ఈ జాడ్యం.. ఇప్పుడు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్‌లకు కూడా పాకింది. పార్టీల నేతల మధ్య బెదిరింపులు పెరిగిపోయాయి. కిడ్నాపులు కూడా చోటు చేసుకుంటున్నాయి.తాజాగా వెలుగు చూసిన ఓ విషయం రాజకీయంగా కలకలం రేపుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సోమవారం జరిగింది. అయితే అదేసమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్తి కాంతి ఖరాడీ  కనిపించకుండా పోవడం సంచలనం అయింది. ఆయన కనిపించడం లేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  చేసిన  ట్వీట్  కలకలం రేపింది.

అయితే ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్న సమయంలో మీడియా ముందుకు వచ్చిన కాంతి ఖరాడీ.. బీజేపీ ప్రత్యర్థి నేత ఆయన అనుచరులు కొందరు కత్తులతో దాడికి దిగడంతో తాను ఆదివారం రాత్రంతా అడవుల్లోనే తలదాచుకున్నానని చెప్పారు. బనస్‌కాంతలోని దాంతాలో రీఎలక్షన్ జరపాలని ఆయన డిమాండ్ చేసారు. దాంతా నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి లధు పరగిపై ఎఫ్ఐఆర్ కూడా ఆయన నమోదు చేశారు. రెండో విడత పోలింగ్ జరుగుతున్న 93 స్థానాల్లో దాంతా నియోజకవర్గం కూడా ఉండడం గమనార్మం.

''రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బీజేపీ నేత అతనికి చెందిన 150 మంది గూండాలు కత్తులతో నాపై దాడికి వచ్చారు.  చంపేస్తారనే భయంతో ప్రాణాలు గుప్పిట పట్టుకుని అడవుల్లోకి పారిపోయాను``  అని  కాంతి ఖరాడి వివరించారు. ఓటర్లను కలుసుకునేందుకు వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి అతని గూండాలు తన కారును అడ్డుకుని తనను చుట్టుముట్టారని చెప్పారు. మొత్తానికి ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపడం గమనార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.