ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. బీజేపీకి పలు రాష్ట్రాల్లో తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో తొలి దశ ఎన్నికలకు సంబందించి 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించిన బీజేపీకి అక్కడ భారీ సెగ తగులుతోంది. దీనిని చక్కదిద్దేంకు పార్టీ అధిష్టానం ప్రయాస పడుతోంది. ఇంతలోనే సముద్ర తీర ప్రాంతం గోవాలోనూ బీజేపీ నేతల మధ్య కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం బీజేపీకి అత్యంత విధేయుడుగా పేరున్న వినయ సంపన్నుడు.. దివంగత మనోహర్ పర్రీకర్ కుమారుడికి బీజేపీ నేతలు.. టికెట్ నిరాకరించారు. అంతేకాదు.. ఆయనపై పార్టీ సీనియర్ నేత మాజీ సీఎం ఫడణవీస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మరింతగా కమల నాథులను కుదిపేస్తోంది.
విషయంలోకి వెళ్తే.. మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్. తన తండ్రి ప్రాతినిధ్య వహించిన పణాజీ సీటు కోసం పట్టుబడుతున్నారు. అయితే బీజేపీ ఇందుకు నిరాకరించింది. ఇంతటితో ఈ సమస్య వదిలేయకుండా. తమ పార్టీ తరుపున పోటీ చేసేందుకు ఉత్పల్కు అర్హత లేదని గోవా ఎన్నికల వ్యవహారాల ఇన్ ఛార్జీగా వ్యహరిస్తున్న మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేవలం మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు అయినంత మాత్రాన ఉత్పల్ టికెట్ ఇవ్వలేమంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీజేపీ నేత అటానాసియో మోన్సెరటే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు బీజేపీకి సెగపుట్టిస్తున్నాయి. అంతేకాదు.. ఉత్పల్ కేంద్రంగా ప్రతిపక్షాలు.. బీజేపీపై కాలుదువ్వుతున్నాయి.
ఉత్పల్ పరీక్కర్ తమ పార్టీ తరుపున పోటీచేయాలంటూ ఆహ్వానాలు పలు పార్టీలు రెడ్ కార్పెట్ పరిచాయి. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీలో చేరాతమంటే ఉత్పల్ను స్వాగతిస్తామన్నారు. తమ పార్టీ తరుపున పోటీ చేయాలని కోరారు. ప్రజలకు సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా బీజేపీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. గోవాలో కాషాయ పార్టీకి పరాభవం తప్పదని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఉత్పల్ పారికర్కు మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ సంజయ్ రౌత్ మద్దతుగా నిలిచారు. గోవా ఎన్నికల బరిలోకి దిగితే బీజేపీయేతర పార్టీలన్నీ ఆయనను గెలిపించాలన్నారు. ఈ మేరకు సంజయ్ రౌత్ ట్విట్ చేశారు.
పనాజీలో అసెంబ్లీ స్థానం నుంచి ఉత్పల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలోకి దింపకూడదని రౌత్ పిలుపునిచ్చారు. ఉత్పల్కు మద్దతుగా నిలవాలని కోరారు. ఇదే మాజీ సీఎం మనోహర్ పారీకర్కు మనమిచ్చే నిజమైన నివాళి అంటూ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ శివసేన వ్యాఖ్యలతో ఇప్పడు బీజేపీ మరింత ఇరకాటంలో పడింది. ఇదిలావుంటే ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఉత్పల్ తీవ్రంగా మండిపడుతున్నారు. నేర చరిత్ర ఉన్నవారికి మాత్రం టిక్కెట్ ఎలా ఇస్తారంటూ అగ్గిమీద గుగ్గలమవుతున్నారు. పార్టీ అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. అభ్యర్థుల ప్రవర్తన వారి సమగ్రతను అధిష్టానం పరిగణలోకి తీసుకోదా.. అని విరుచుకుపడుతున్నారు.