సుజనా సీఎం రమేశ్ చేరికల వెనుక షరతులు ఇవేనా!

Wed Jul 17 2019 13:43:23 GMT+0530 (IST)

తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి చేరిపోవడం వెనుక అంతా చంద్రబాబు నాయుడి స్కెచ్చే ఉందనే అభిప్రాయాలు మొదటి నుంచి ఉన్నాయి. స్వయంగా ఆ ఎంపీలే ఇన్ డైరెక్టుగా ఆ మాట చెప్పారు. తాము బీజేపీలోకి చేరబోతున్న విషయాన్ని చంద్రబాబుకు ముందే చెప్పినట్టుగా టీజీ వెంకటేష్ స్వయంగా చెప్పారు.ఇక తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులం తాము అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు సుజనా చౌదరి. ఇలా తాము బీజేపీలోకి చేరడం వెనుక చంద్రబాబు నాయుడి ఆశీస్సులు ఉన్నాయనే విషయాన్ని ఆ ఎంపీలు పరోక్షంగా చెప్పారు చెబుతున్నారు కూడా!

ఇక ఫిరాయించిన ఆ నలుగురు రాజ్యసభ సభ్యులి మీద అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా పోరాడటం లేదు. గట్టిగా పోరాడటం కాదు కదా నామమాత్రంగా కూడా టీడీపీ ఆ డిమాండ్ ను చేయకపోవడం గమనార్హం.

ఇంతకీ తెలుగుదేశం అధినేత ఎందుకు అలా రాజ్యసభ సభ్యులను బీజేపీకి వదులుకున్నారు? ఎందుకు వారిని అలా అప్పగించేశారు? అంటే.. అందులో కొన్ని షరతులు ఉన్నాయనే ప్రచారం జరుగుతూ ఉంది.

తాజా పరిణామాలు అందుకు ఊతం ఇస్తూ ఉండటం గమనార్హం. తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్ల అధికార కాలంలో బోలెడన్ని అక్రమాలకు పాల్పడిందని బీజేపీనే స్వయంగా ఆరోపించింది. అయితే ఇప్పుడు ఆ స్కాముల గురించి బీజేపీ మాట్లాడకపోవడం గమనార్హం.

ఆఖరికి పోలవరం అక్రమాల గురించి కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు మాట్లాడటం లేదు. పోలవరం స్కామ్ పై విచారణ జరిపించే ఉద్దేశం లేదని కేంద్రం అంటోంది. గతంలోనేమో పోలవరం ప్రాజెక్టును ఏటీఎంల వాడుకున్నారు చంద్రబాబు అంటూ బీజేపీనే విమర్శించింది. ఇప్పుడు మాత్రం బీజేపీ ఆ విషయంలో మాట్లాడటం లేదు.

ఇదంతా చంద్రబాబు బీజేపీల మధ్య కుదిరిన ఒప్పందం అని తన ఎంపీలను బీజేపీకి ఇచ్చి చంద్రబాబు నాయుడు తన హయాంలో జరిగిన అక్రమాలపై ఎలాంటి విచారణ లేకుండా చూసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉందిప్పుడు.