Begin typing your search above and press return to search.

బందిపోటు మాట.. బాబుపై బీహార్ కోర్టులో పిటీషన్

By:  Tupaki Desk   |   25 March 2019 5:51 AM GMT
బందిపోటు మాట.. బాబుపై బీహార్ కోర్టులో పిటీషన్
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీకి మద్దతుగా వ్యూహాలు రచించారన్న కారణంగా బీహార్ కు చెందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా ‘బీహార్ బందిపోటు’ అని ప్రశాంత్ కిషోర్ పై నోరుపారేసుకున్నారు. దీనిపై ప్రశాంత్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీహార్ లోని ముజఫరాపుర్ కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పీటీషన్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి తాజాగా దీనిపై విచారణ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో చంద్రబాబు ఈ కేసును ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ‘బీహార్ బందిపోటు’ అనే వ్యాఖ్యలు బీహారీలను అవమానించేలా ఉన్నాయని బీహార్ కు చెందిన ఓ న్యాయవాది ముజఫరాపూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బీహార్ ప్రజలను చంద్రబాబు అవమానించాడని పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకొని విచారిస్తామని.. తదుపరి 28న విచారణను వాయిదా వేసింది. దీంతో చంద్రబాబు నోరు జారి చిక్కుల్లో పడ్డట్టైంది. కేసులో ఆరోపణలు తేలితే బాబు న్యాయసమీక్షకు నిలబడాల్సి వస్తుంది.

ఇటీవల ఒంగోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజకీయ వ్యహకర్త ప్రశాంత్ కిషోర్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో బీహారీ దోపిడీ ముఠా ప్రవేశించిందని.. బీహార్ బందిపోటు ఇక్కడి ప్రతిపక్ష వైసీపీతో కలిసి ఏపీలోని అనేక ఓట్లను తొలగించారని చంద్రబాబు విమర్శించారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపింది. ప్రశాంత్ ట్విట్టర్ లో బాబుపై విమర్శలు చేయగా.. కొందరు బీహారీలు చంద్రబాబు కోర్టులో ఫిర్యాదు చేసి బోనులో నిలబెట్టడానికి రెడీ అయ్యారు