పాచిపోయిన లడ్డూలు.. బందరు లడ్డులయ్యాయా?

Fri Jan 17 2020 20:00:01 GMT+0530 (IST)

Communist Parties Fires on Pawan kalyan

హవ్వా.... ఎక్కడైనా తాజా లడ్డూలు అలా కొంత కాలం పెట్టేస్తే... పాచిపోయిన లడ్డూలుగా మారిపోతాయి గానీ... పాచిపోయిన లడ్డూలను అలా పెట్టేస్తే బందరు లడ్డూలు అయిపోతాయా? సాదారణంగా ఇది అయ్యే పని కాదు గానీ... జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం పాచిపోయిన లడ్డూలు కూడా బందరు లడ్డూలుగా తాజా లడ్డూలుగా టేస్టీ లడ్డూలుగా మారిపోతాయి. నిజమా? అంటే... గత వారం రోజులుగా పవన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... పవన్ విషయంలో ఈ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు మరి. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అప్పుడెప్పడో కాకినాడ వేదికగా పవన్ ఓ రేంజిలో ఫైరయ్యారు కదా. మరి ఓ మూడేళ్లు గడిచేసరికి అదే బీజేపీతో పవన్ ఇప్పుడు పొత్తు పెట్టేసుకున్నారు. అంటే.. నాడు బీజేపీ విధానాలను పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్... అదే బీజేపీ వైఖరిని ఇప్పుడు బందరు లడ్డూలతో పోలుస్తున్నట్లే కదా.2019 ఎన్నికల్లో వామపక్షాలు - బీఎస్పీతో కలిసి సాగిన పవన్... టీడీపీతో లోపాయికారీ ఒప్పందాన్ని కూడా కొనసాగించారన్న వాదనలు లేకపోలేదు. ఈ లోపాయికారీ ఒప్పందం కారణంగా తమకిచ్చిన మంగళగిరి అసెంబ్లీ సీటు- విజయవాడ ఎంపీ సీట్లు చేజారినా కూడా తమ కంటే పెద్ద కమ్యూనిస్టుగా కనిపిస్తున్న పవన్ ను ఏమీ అనలేక వామపక్ష పార్టీలు మిన్నకుండిపోయాయి. అయితే ఎన్నికల్లో పవన్ ను నమ్మిన వామపక్షాలతో పాటుగా పవన్ కూడా బొక్క బోర్లా పడ్డారు. వామపక్షాల సంగతి అలా పక్కనపెడితే.. తాను నిలబడ్డ రెండు చోట్ల కూడా పవన్ ఘోర పరాజయం పాలయ్యారు. ఇక బీఎస్పీ సంగతి సరే సరి. మరి ఆ అనుభవాలు పవన్ లోని పెద్ద కమ్మూనిస్టును చంపేశాయో? ఏమో తెలియదు గానీ... ఇప్పుడు వామపక్షాలను నట్టేట వదిలేసిన పవన్ ఏకంగా బీజేపీ చంకన ఎక్కేశారు.

ఇక్కడే వామపక్షాలు పవన్ వైఖరిని తప్పుబడుతున్నాయి. నిన్న విజయవాడ కేంద్రంగా జరిగిన బీజేపీ జనసేన భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్... తమ రెండు పార్టీల సిద్ధాంతాలు ఒకటేనని - అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యలను పదే పదే గుర్తు చేస్తున్న లెఫ్ట్ పార్టీలు... నాడు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగిన విషయాన్ని అప్పుడే మరిచిపోయారా? లేదంటే... నాడు ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ కు ఇప్పుడు అవే లడ్డూలు బందరు లడ్డూలు అయిపోయాయా? అని లెఫ్ట్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీ సైద్ధాంతికతతో పుట్టిన జనసేనను తమతో కలిసి ఎలా కొనసాగించారని కూడా ఎర్రన్నలు ప్రశ్నిస్తున్నారు. మరి ఎర్రన్నల ప్రశ్నలకు పవన్ బదులిస్తారో? లేదో? చూడాలి.