Begin typing your search above and press return to search.

అలీ ఓకే.. టార్గెట్ అదేనట.. ?

By:  Tupaki Desk   |   18 May 2022 12:54 PM GMT
అలీ ఓకే.. టార్గెట్ అదేనట..  ?
X
టాలీవుడ్ కమెడియన్ అలీకి వైసీపీలో రాజ్య సభ సీటు ఎందుకు దక్కలేదు అన్న దాని మీద ఇపుడు జోరుగా ప్రచారం సాగుతోంది. అలీకి కచ్చితంగా రాజ్య సభ సీటు ఇచ్చి తీరుతారు అని అంతా అనుకున్నారు. కొద్ది నెలల క్రితం జగన్ క్యాంప్ ఆఫీస్ కి అలీ స్వయంగా వెళ్లి కలసి వచ్చారు. ఆ మీదట మీడియా ఏమైనా గుడ్ న్యూస్ ఉందా అని మీడియా అంటే ఏది ఉన్నా మీకే ముందు తెలుస్తుంది కదా అని కూడా అలీ చెప్పారు.

అయితే నాడు వినిపించిన మాట ఏంటి అంటే అలీకి రాజ్యసభ సీటు కన్ ఫర్మ్ చేయనున్నారు అని. పెద్దల సభలో మైనారిటీ కోటాలోనూ, అలాగే సినీ రంగానికి సంబంధించి అలీకి ఈ కీలకమైన పదవి దక్కుతుంది అని కూడా అనుకున్నారు. అయితే తాజాగా ప్రకటించిన వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల లిస్ట్ లో అలీ పేరు లేదు. దాంతో అలీ దీని మీద తీవ్రంగా నిరాశ చెందారని, ఆయన వైసీపీకి దూరం అవుతారని రకరకాలైన వార్తలు చక్కలు కొట్టాయి.

అయితే దీని మీద అలీ అయితే స్వయంగా ఖండించడం విశేషం. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, తాను ఒక విధంగా చూస్తే రాజ్య సభ సీటు ఆశించలేదని కూడా చెప్పుకున్నారు. ఇక తనకు ఏ పదవి ఇవ్వాలన్నది జగన్ ఇష్టమని, తాను జగన్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను అని కూడా అలీ చెప్పుకున్నారు.

జగన్ కోసం విధేయతతో పార్టీకి పనిచేస్తాను అని అలీ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా అలీ మనసు ఎప్పటి నుంచో రాష్ట్ర మంత్రి పదవి మీదనే ఉంది అంటున్నారు. ఆయన ఏదో నాడు అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి కావాలనే కోరుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు.

నాడు అలీ రాజమండ్రీ సీటు కోరుకున్నారని కూడా ప్రచారం సాగింది. అయితే అక్కడ సామాజిక సమీకరణలు సరిపోకపోవ‌డం ఎన్నికలకు టైమ్ పెద్దగా లేకపోవడం వల్ల అలీ సేవలను పార్టీ ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. ఇక ఈసారి అంటే 2024 ఎన్నికల వేళకు మాత్రం అలీ కచ్చితంగా ఎమ్మెల్యే గా పోటీ చేస్తారు అని అంటున్నారు. అలీ స్వస్థలం రాజమండ్రీ. అయితే ఆయన సినీ నటుడు కాబట్టి ఎక్కడ నుంచి అయినా పోటీ చేయించే ఆలోచన కూడా వైసీపీ అధినాయకత్వానికి ఉందని అంటున్నారు.

మొత్తానికి అలీ అసంతృప్తితో లేనని తానే చెబుతున్నారు, ఇక జగన్ కూడా అలీ విషయంలో ఆయన విధేయత విషయంలో ప్రత్యేక దృష్టితోనే చూస్తారని, అందువల్ల అలీకి వైసీపీలో మంచి గుర్తింపు ఉంటుందనే అంటున్నారు. మరి అలీ వైసీపీకి రాజీనామా చేస్తారు, ఆయన ఆ పార్టీకి దూరం అవుతారు అంటూ వచ్చిన ప్రచారం ఏ విధంగా వైరల్ అయిందో మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. అలీ హర్ట్ అయ్యారని వచ్చిన వార్తలు నిజం కావనే ఆయన సన్నిహిత వర్గాలు సైతం ఖండిస్తున్నాయి.