Begin typing your search above and press return to search.

కోట్లు కొల్లగొట్టిన సంక్రాంతి కోళ్లు !

By:  Tupaki Desk   |   17 Jan 2020 7:26 AM GMT
కోట్లు కొల్లగొట్టిన సంక్రాంతి కోళ్లు !
X
ఆంధ్రప్రదేశ్‌ లో సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు జోరుగా సాగాయి. ఏపీ పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు ఈ కోడిపందేలని ఏ మాత్రం ఆపలేకపోయాయి. వందలాది కోడిపందేలు - జూదం - రాత్రి - పగలు అన్న తేడా లేకుండా సాగాయి. గతంతో పోలిస్తే సరాసరిగా ఒక్కో పందెం రెట్టింపయ్యింది. రూ.పది వేల నుంచి లక్షన్నర వరకు బెట్టింగ్‌ లు జరిగాయి. పెద్దబరుల వద్ద స్థానిక నేతల పెత్తనమే సాగింది. రాత్రివేళల్లో ఫ్లడ్‌ లైట్‌ వెలుగులో పందేలు సాగాయి. పశ్చిమలో మూడురోజుల కోడిపందేల్లో రూ.70కోట్లు చేతులు మారినట్టు తెలుస్తుంది. తెలంగాణలో కరీంనగర్‌ - ఖమ్మం - హైదరాబాద్‌ - నల్లగొండ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చి బెట్టింగ్‌ లకు దిగారు. ముంబై - చెన్నై నుంచి వచ్చినవారు గుండాటలో లక్షల్లో పందేలు కాశారు. చింతలపూడి సమీపంలోని చింతపల్లిలో పరస్పరం ఘర్షణలకు పాల్పడటంతో కొంతమందిని ఖమ్మంజిల్లా సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ను తానే అభివృద్ధి చేశానంటూ గొప్పలు చెప్పుకునే ఒకాయన మూలనపడ్డాడని వ్యాఖ్యానించారు. గత సంవత్సరం సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా తాను చెప్పినట్టుగానే ఏపీలో ప్రభుత్వం మారిందని గుర్తుచేశారు. ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం మంచి పరిణామమని అన్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా రూ.100కోట్ల పైచిలుకు చేతులు మారినట్లు సమాచారం. కంకిపాడు మండలం ఈడ్పుగల్లు - పెనమలూరు - పోరంకిలో పెద్ద బరులు ఏర్పాటు చేశారు. గన్నవరం మండలంలో ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు పెద్దఎత్తున పేకాట శిబిరం ఏర్పాటుచేసి మనిషికి రూ.10వేలు చొప్పున వసూలు చేశారు.

చిత్తూరు జిల్లాలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు జరిపిన దాడుల్లో మొత్తం 30మంది అరెస్టయ్యారు. తమిళనాడుతో సరిహద్దు కలిగిన మండలాల్లో పెద్దఎత్తున కోడిపందేలు జరిగాయి. వరదయ్యపాళెం మండలం అయ్యవారిపాళ్యం వద్ద జరిపిన దాడుల్లో ఏకంగా 17మంది పందెంరాయుళ్లు పట్టుబడ్డారు. తాడేపల్లిగూడెం అర్బన్‌: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పందుల పోటీలు నిర్వహించారు. కడప - ప్రకాశం - తూర్పు - పశ్చిమ - విశాఖపట్నం జిల్లాల నుంచి తీసుకొచ్చిన పందులు ఈ పోటీల్లో తలపడ్డాయి. తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పందుల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు కోడిపందేలు జోరుగా సాగి ..కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్టు సమాచారం.