ఎన్నికలు వాయిదా వేయండి.. ఈసీకి ఆ రాష్ట్ర సీఎం లేఖ

Sun Jan 16 2022 12:21:01 GMT+0530 (India Standard Time)

Cm Letter About Elections Postpone

దేశం మొత్తం పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్దీ.. సరికొత్త రికార్డుల దిశగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం నాటికి  2.8 లక్షల కేసులు నమోదు కావటం తెలిసిందే. తాజా అంచనాల ప్రకారం మూడు లక్షల కేసుల మార్కు ఈ రోజు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఇంతలా కేసులు పెరుగుతున్న వేళలోనూ.. షెడ్యూల్ ప్రకారం ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని నిర్వహించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.అయితే.. రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయని ఈసీ చెబుతోంది. ఇలాంటి వేళ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ సంచలనానికి తెర తీశారు. తాజాగా జరుగుతున్న ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపంతా ఉత్తరప్రదేశ్.. పంజాబ్ ఫలితం మీదనే ఉంది. బీజేపీకి చేదు అనుభవాన్ని మిగిల్చేలా పంజాబ్ ఫలితం ఉంటుందని భావిస్తున్నవేళ.. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరటంఆసక్తికరంగా మారింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను చూస్తే.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ ను నిర్వహిస్తుండగా.. ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించటం తెలిసిందే. అయితే.. కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న వేళ..ఎన్నికల నిర్వహణ ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. అందుకు భిన్నమైన కారణాన్ని ఎత్తి చూపుతున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ. ఎన్నికల వాయిదాకు ఆయన తెర మీదకు తీసుకొచ్చిన అంశం ఇప్పుడుచర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన లేఖ ఒకటి ఈసీకి సీఎం రాశారు.

షెడ్యూల్ ప్రకారం పంజాబ్ లో పోలింగ్ ను ఫిబ్రవరి 14న నిర్వహించాలని ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే.. తమ రాష్ట్రంలోని ఒక వర్గం వారు పెద్ద ఎత్తున గురు రవిదాస్ జయంతి వేడుకల కోసం  బెనారస్ కు వెళతారని.. వారి వినతిలో భాగంగా ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యలో యూపీలోని బెనారస్ కు తమ రాష్ట్రం నుంచి దళిత వర్గాలు పెద్ద ఎత్తున వెళతాయని.. ఏకంగా 20 లక్షల మంది ఈ వేడుకలకు వెళ్లే వీలు ఉన్న నేపథ్యంలో.. ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరారు. ఇప్పటికే ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు ఎన్నికల వాయిదా అంశాన్ని పరిశీలించాలని కోరినట్లుగా సీఎం చెబుతున్నారు.

తమ రాష్ట్రంలో ఈ వేడుకల కోసం వెళ్లే  వర్గానికి చెందిన వారు దాదాపు 32 శాతం మంది ఉన్నారన్నారు. పోలింగ్ తేదీని మార్చిన పక్షంలో బెనారస్ వెళ్లి రావటానికి వీలు ఉంటుందని.. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉందంటున్నారు. దీంతో.. సీఎం లేఖపై ఈసీ ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఎన్నికల్ని రద్దు చేయకున్నా.. పోలింగ్ తేదీని మార్చాలని కోరుతున్నందున ఈసీ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పంజాబ్ ముఖ్యమంత్రి వినతిపై ఈసీ ఎలా రియాక్టు అవుతుందన్నది ప్రశ్నగా మారింది. అయినా.. కొవిడ్ కేసులు పెరుగుతుంటే.. ఆ ఆందోళన కంటే కూడా.. వేడుకలకు వెళ్లాలని భావిస్తున్న లక్షలాది మందిగురించి పంజాబ్ ముఖ్యమంత్రి మాట్లాడటం ఏమిటో? అయినా.. మూడో వేవ్ వేళ.. ఇలా ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచన చేయాల్సిన ఆయన.. ఎన్నికల వాయిదాను కోరటం గమనార్హం.