అనంతపురం టీడీపలో అంతర్గత పోరు...అంతం కాలేదట

Sat Nov 21 2020 20:40:09 GMT+0530 (IST)

Internal fighting in Anantapur TDP ... never ending

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావించాయి. కరోనా నేపథ్యంలో వాయిదాపడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అయితే కరోనాకు ముందు మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవంగా వైసీపీ అభ్యర్థులు ఎంపిక కావడం...కొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు డీలాపడ్డారు. దీనికి తోడు కొన్ని జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఈ కోవలోనే చాలాకాలంగా అనంతపురం టీడీపీలో అంతర్గతంగా ఉన్న వర్గపోరు లోకల్ వార్ నేపథ్యంలో మరోసారి బయటపడింది. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది.2014 ఎన్నికల తర్వాత జేసీ ప్రభాకర్ వర్గాల మధ్య గొడవలు ముదిరి ఎవరో ఒకరే టీడీపీలో ఉంటారనుకున్నారు. ఎలాగోలా వారిద్దరికీ చంద్రబాబు సర్ది చెప్పడంతో సైలెంట్ అయ్యారు. అయితే 2019 ఎన్నికలలో ఇటు ఎంపీగా జేసీ పవన్ ఎమ్మెల్యేగా ప్రభాకర్ చౌదరి ఓటమిపాలయ్యారు. కొద్ది రోజుల క్రితం అనంతపురం ఎంపీ సీటు ఇన్ చార్జి బాధ్యతల నుంచి పవన్ ను తప్పించారు. అయితే అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో ప్రభాకర్ చౌదరి గుర్రుగా ఉన్నారట. ఎవరికి వారే తమది పైచేయని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారట. అధికారం ప్రతిపక్షం ....ఇలా పార్టీ ఏ పొజిషన్ లో ఉన్నా....వీరి గొడవలు మాత్రం అలాగే ఉన్నాయని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే డీలా పడ్డ కేడర్....వీరి అంతర్గత విభేదాలతో మరింత డీలా పడుతున్నారట. మరికొద్ది రోజుల్లో లోకల్ వార్ జరిగే చాన్స్ ఉండడంతో అభ్యర్థులలో ఆందోళన మొదలైందట. మరి ఈ వ్యవహారంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.