కుమారస్వామి కేసీఆర్ విడిపోయారా? అసలు క్లారిటీ ఇదీ

Fri Feb 03 2023 20:00:02 GMT+0530 (India Standard Time)

Clarity on KCR and Kumara Swamy Seperation

తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి దూరమైనట్లు ఇటీవల జోరుగా వార్తలొచ్చాయి. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ మొదటి విడతలో కుమార స్వామి ఇంటికి స్వయంగా వెళ్లారు. ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడతో రాజకీయాలపై చర్చించారు. ఆ తరువాత బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కుమారస్వామికి ఆహ్వానం పంపడంతో ఆయన ఢిల్లీకి వచ్చారు. దీంతో బీఆర్ఎస్ జేడీఎస్ ల మధ్య మైత్రి బంధం కొనసాగుతుందని అర్థమైంది.అయితే ఖమ్మంలో నిర్వహించిన సభకు కుమార స్వామి హాజరు కాలేదు. మరోవైపు బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో  పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో కేసీఆర్ కుమారస్వామి విడిపోయారా..? అన్న చర్చ సాగింది. అయితే దీనిపై కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తరువాత ఖమ్మంలో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కానీ కుమారస్వామి హాజరు కాలేదు. దీంతో బీఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాలు నచ్చకనే ఆయన సభకు రాలేదని కొందరు ప్రచారం చేశారు. అంతేకాకుండా ఇక కుమారస్వామి బీఆర్ఎస్ కు దూరమయ్యాడని మీడియా వేదికగా వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ సభకు రాకపోవడంపై కుమారస్వామిని ప్రశ్నించగా తాను 'పంచరత్న' యాత్రతో బిజీగా ఉండడం వల్ల ఖమ్మం సభకు రాలేదని వివరణ ఇచ్చారు.

ఆ తరువాత కేసీఆర్ పలు సందర్భాల్లో కర్ణాటకలో పోటీ చేస్తానని అన్నారు. అటు బీఆర్ఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ కర్ణాటక పర్యటన సందర్భంగా అక్కడ బీఆర్ఎస్ పోటీ చేయదని అన్నారు. జేడీఎస్ కు మద్దతు ఇస్తుందని తెలిపారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అసలు కుమారస్వామికి మద్దతు ఇస్తున్నారా..? లేక కర్ణాటకలో పోటీ చేస్తారా..? అనే విషయంపై తీవ్రంగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కేసీఆర్ దూరమయ్యారని అన్నారు.

కానీ తాజాగా కుమారస్వామి తాను కేసీఆర్ తో మైత్రి బంధం కొనసాగిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆయన రాయచూర్ లో నిర్వహిస్తున్న 'పంచరత్న' యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ తనకు తండ్రి దేవేగౌడ తరువాత కేసీఆరే స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ తనకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. తనకు మరోసారి అధికారం అందిస్తే కేసీఆర్ లా అభివృద్ధి చేస్తానని కుమార స్వామి ప్రకటించడం విశేషం.

ఈ నేపథ్యంలో త్వరలో కేసీఆర్ కర్ణాటక పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. ఈ పర్యటనతో బీఆర్ఎస్ కర్ణాటకలో పోటీ చేస్తారా..? లేక జేడీఎస్ కుమద్దతు ఇస్తారా..? అనేది తేలనుంది. అయితే అటు జేడీఎస్ ఇప్పటికే కర్ణాటకలోని అన్ని అసెంబ్లీలో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగానే అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేందుకు 'పంచరత్న' యాత్ర నిర్వహిస్తోంది. దీంతో కేసీఆర్ ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారని బీఆర్ఎస్ లో చర్చించుకుంటున్నారు.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.