Begin typing your search above and press return to search.

99 వద్ద ఔటైనందుకు మంట.. బ్యాట్ నేలకేసి కొట్టిన గేల్ కి జరిమానా

By:  Tupaki Desk   |   31 Oct 2020 10:50 AM GMT
99 వద్ద ఔటైనందుకు మంట.. బ్యాట్ నేలకేసి కొట్టిన గేల్ కి జరిమానా
X
ఐపీఎల్లో భాగంగా శుక్రవారం రాత్రి పంజాబ్ - రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అదరగొట్టాడు.తన సహజ శైలికి భిన్నంగా వికెట్ కి ప్రాధాన్యం ఇస్తూ 63 బంతుల్లో 99(6 ఫోర్లు, 8 సిక్సర్లు) పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. దీంతో పట్టరాని కోపంతో గేల్ బ్యాట్ ని నేల కేసి కొట్టాడు. దీంతో అతడిపై ఐపీఎల్ నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘించి అందుకు తగిన చర్యలు తీసుకున్నారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. శుక్రవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ స్టోక్స్, శాంసన్ రాణించడంతో రాయల్స్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

కాగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సిక్స్ బాదిన గేల్.. 99 రన్స్‌కు చేరుకున్నాడు. ఆ మరుసటి బంతికే ఆర్చర్ అద్భుతమైన యార్కర్‌తో గేల్‌ను బౌల్డ్ చేశాడు. ముందుగా ప్యాడ్లను తాకిన బంతి ఆ తర్వాత వికెట్లను గిరాటేసింది. సెంచరీ మిస్ కావడంతో గేల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. చేతిలో ఉన్న బ్యాట్‌ను విసిరేశాడు.పెవిలియన్ వెళ్తూ తనను బౌల్డ్ చేసిన జోఫ్రా ఆర్చర్‌తో చేయి కలిపి అభినందించాడు.

నిబంధనలు ఉల్లంఘించి బ్యాట్ విసిరి కొట్టిన గేల్‌కు జరిమానా పడింది. ఔటయ్యాక ఆగ్రహం వ్యక్తం చేయడం ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలకు విరుద్ధం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని అఫెన్స్ 2.2లోని లెవల్ 1 ప్రకారం మ్యాచ్ రిఫరీ.. గేల్ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించాడని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. గేల్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గేల్ 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో రెండుసార్లు 99 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా గేల్ రికార్డ్ సాధించాడు. చాలా మ్యాచ్ ముగిసిన అనంతరం గేల్ మాట్లాడుతూ ఈ రోజు సెంచరీ చేస్తానని సహచరులకు మాటిచ్చా. కానీ చేయలేకపోయా. అయినా ఈ 99 నా మనసుకు మాత్రం సెంచరీనే..పంజాబ్ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే బాగుంటుంది అని అన్నాడు.