Begin typing your search above and press return to search.

క్లోరిన్ గ్యాస్ లీక్.. ఘోర ప్రమాదం

By:  Tupaki Desk   |   28 Jun 2022 10:30 AM GMT
క్లోరిన్ గ్యాస్ లీక్.. ఘోర ప్రమాదం
X
జోర్డాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విషపూరిత వాయువు లీకైన ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 251 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. క్లోరిన్‌ గ్యాస్‌తో నిండిన ట్యాంకర్లను షిప్పుల్లో ఎక్కించే సమయంలో ప్రమాదం జరిగింది.

జోర్డాన్ దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో విషాదం చోటుచేసుకుంది. క్లోరిన్ గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది మృత్యువాతపడ్డారు. మరో 251 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్‌ గ్యాస్‌తో నిండిన ట్యాంకర్లను ఓడలో ఎక్కించే సమయంలో ప్రమాదం జరిగింది.

క్లోరిన్ గ్యాస్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ క్రమంలో విషపూరిత క్లోరిన్ గ్యాస్ ఆ ప్రాంతమంతా విస్తరించగా.. ఆ పరిసరాల్లో ఉన్న వారిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. విషవాయువు పీల్చుకున్న మరో 251 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్ అల్ షాబౌల్ వెల్లడించారు.

ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 199 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.

ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

విషవాయువు వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఓడరేవుకు ఉత్తరాన 16 కిలోమీటర్లు దూరంలో ఉన్న అకాబా నగర ప్రజలు మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. కిటికీలు, తలుపులు మూసివేసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.