చిరు అడిగారు..జగన్ ఓకే చెప్పేశారు!

Tue Oct 15 2019 12:07:36 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ రంగంలో అత్యత్తుమ ప్రదర్శన చేసిన వారికి నంది అవార్డుల పేరుతో ప్రతి ఏటా ఇవ్వటం తెలిసిందే. అయితే..బాబు ప్రభుత్వం నంది అవార్డుల్ని ప్రదానం చేయకుండా పేర పెట్టి.. ఒకేసారి మూడేళ్లకు (2014 - 2015 - 2016) ఒకేసారి విజేతల్ని ప్రకటించటం..ఈ ఎంపిక మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చి.. వివాదాస్పదం కావటం తెలిసిందే.దీంతో.. నంది అవార్డుల మహోత్సవాన్ని నిర్వహించకుండా బాబు ప్రభుత్వం ఆపేసింది. అనంతరం నంది అవార్డుల విషయం అలా ఆగిపోయింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ వేళ నంది అవార్డుల ప్రదానోత్సవం గురించి చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

పెండింగ్ లో ఉన్న అవార్డుల ప్రధానోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తే బాగుంటుందన్న సూచనకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈ డిసెంబరులో పూర్తి చేయాలన్న విషయాన్ని చిరుకు సీఎం జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులతో ఒకసారి భేటీ కావాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది.