Begin typing your search above and press return to search.

వైఎస్ షర్మిల మీద చింతా మోహన్ సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   30 May 2023 9:59 PM GMT
వైఎస్ షర్మిల మీద చింతా మోహన్ సంచలన కామెంట్స్
X
వైఎస్ షర్మిల తెలంగాణా రాజకీయాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆమె సొంత అన్న ప్రభుత్వం ఏపీలో ఉంది. ఆ ప్రభుత్వం రావాలని కావాలని షర్మిల తన వంతుగా వైసీపీకి ఎంతో ప్రచారం చేశారు. అందువల్ల ఆమె ఏపీ వైపు ఏపీ రాజకీయల వైపు చూస్తారా అన్నది తెలియని విషయం.

అయితే చూడబోతే గాలి కాస్తా తెలంగాణా వైపు నుంచి మళ్ళి ఏపీ వైపుగా వస్తుందని అంటున్నారు కాంగ్రెస్ పెద్దలు షర్మిలను వైఎస్సార్ బ్లడ్ అని తీసుకోవడానికి చూస్తున్నారు. ఆమెను తెలంగాణా కంటే ఏపీ మీద ఫోకస్ పెట్టమని కూడా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వైఎస్ షర్మిల ఇప్పటికి రెండు సార్లు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ని కలుసుకున్నారు.

ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్నది గట్టిగానే ప్రచారంలో ఉంది. ఈ నేపధ్యంలో ఏపీ కాంగ్రెస్ లో కీలక నేత, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన చింతా మోహన్ షర్మిల మీద సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లోకి వస్తామంటే తాము తప్పకుండా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.

అయితే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం కాపులకు, బీసీలకు మాత్రమే ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ముఖ్యమంత్రి పదవి కేవలం రెండు సామాజిక వర్గాలకే పరిమితం అయిపోయిందని, కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటిస్తుందని ఆయన పేర్కొన్నారు.

వరసబెట్టి షర్మిల డీకే శివ కుమార్ తో సమావేశం కావడం మీద ఆయన కామెంట్స్ చేశారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కాబట్టే ఆమె కలుస్తున్నారని అన్నారు. మొత్తానికి చూస్తే చింతా మోహన్ కామెంట్స్ బట్టి ఏపీలో షర్మిల వచ్చి పార్టీని బలోపేతం చేసినా ముఖ్యమంత్రి పదవి మాత్రం ఆమెకు ఇవ్వమని చెప్పకనే చెప్పేశారు.

ఇప్పటికే తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవన్ రెడ్డి కూడా షర్మిలకు తెలంగాణాలో ఏమి పని ఆమె ఆంధ్రాకు వెళ్ళి అక్కడ రాజకీయాలు చేయాలని సూచించారు. ఇపుడు ఏపీలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినా సీఎం సహా కీలక పదవులు ఇవ్వబోమని ఇండైరెక్ట్ గా చింతా మోహన్ అంటున్నారు.

మొత్తానికి షర్మిలకు కాంగ్రెస్ పట్ల ఆసక్తి ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమెని పార్టీలోకి తీసుకోవడానికి వ్యతిరేకిస్తున్నట్లుగానే ఉంది. వైఎస్సార్ కి కాంగ్రెస్ లో అనుకూల వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. ఆయన మూడున్నర రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే గడచింది. అయితే కాంగ్రెస్ ని ఎదిరించి బయటకు వెళ్ళిన వైఎస్సార్ ఫ్యామిలీ తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చినా పూర్వపు ప్రాభవం దక్కుతాయా అంటే ఆ చింతలేమీ పెట్టుకోవద్దు అన్నట్లుగానే చింతా మోహన్ లాంటి పెద్దల మాటలు ఉన్నాయి.

ఇక ఏపీలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, 2024 లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చింతా మోహన్ జోస్యం చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేస్తూ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం చేస్తుందని చింతా మోహన్ అంటున్నారు.