Begin typing your search above and press return to search.

చైనా వర్సెస్ అమెరికా... ఆ విషయంలో గెలుపు ఎవరిదంటే?

By:  Tupaki Desk   |   10 Jun 2023 11:54 AM GMT
చైనా వర్సెస్ అమెరికా... ఆ విషయంలో గెలుపు ఎవరిదంటే?
X
అమెరికా, చైనా ఆధిపత్య యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు ఈ దేశాల ఆదిపత్య యుద్ధం సముద్ర గర్భంలోకీ చేరింది. సమాచార విప్లవ వారధులైన సముద్రంలోని ఇంటర్నెట్‌ కేబుళ్లపై పెత్తనానికి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీనిపై అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసి... ఈ ప్రాజెక్టు నుంచి చైనా కంపెనీలను తప్పించింది. చివరకు తమ దేశ కంపెనీకి కట్టబెట్టుకోవటంలో విజయం సాధించింది.

ఫోన్లు, వీడియో చాట్లు, ఈమెయిల్స్‌ ఇలా సమాచార విప్లవానికి కారణమై ప్రపంచం కుగ్రామంగా మారటానికి మూలం ఇంటర్నెట్‌. ఆ ఇంటర్నెట్‌ సక్రమంగా పని చేస్తుందంటే... సముద్ర గర్భంలో వేసిన కేబుల్‌ లైన్లు కారణం. అన్ని సముద్రాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 9 లక్షల మైళ్ల ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్ల ద్వారానే ప్రపంచంలోని 95% డాటా అనుక్షణం ప్రసారమవుతుంటుంది. ఇప్పుడా కేబుల్‌ వ్యవస్థలే చైనా, అమెరికాల మధ్య సముద్రంలో మంటలు రేకెత్తించాయి.

అమెరికా, చైనాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికీ ఆయుధాలవుతున్నాయి. చాలా కాలంగా ఈ సముద్ర గర్భ కేబుల్‌ వ్యవస్థ అమెరికా కంపెనీల చేతుల్లో సాగుతోంది. తాజాగా... చైనాకు చెందిన కన్సార్షియం రంగంలోకి దిగటంతో సమస్య మొదలైంది.

అమెరికాకు చెందిన సబ్‌కామ్‌ కన్సార్షియానికి చైనా కంపెనీ హెచ్ఎంఎన్‌ టెక్‌ కేబుల్‌ నెట్‌వర్క్స్‌ పోటీగా ముందుకొచ్చింది. హెచ్ఎంఎన్‌ కన్సార్షియంలో వివిధ దేశాల కంపెనీలతో పాటు చైనా టెలికాం దిగ్గజం హువావే కూడా ఉండటం వివాదానికి దారితీసింది.

తాజాగా సముద్ర గర్భంలోని ఇంటర్నెట్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ వ్యవస్థపైనా హువావే రూపంలో చైనా ప్రభుత్వం నిఘా పెట్టబోతోందన్నది అమెరికా ఆరోపిస్తోంది. ఈ కేబుళ్ల ద్వారా ప్రసారమయ్యే డేటాను, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను, మిలిటరీ సమాచారాన్ని... చైనా ప్రభుత్వం గుప్పిట పెట్టుకునే ప్రమాదముందని చెబుతోంది. గతంలో కెనడాలో, ఆఫ్రికా దేశాల్లో చైనా కంపెనీ డేటా చౌర్యం గురించి అమెరికా గుర్తు చేస్తోంది.

అమెరికా ప్రభుత్వం పరోక్షంగా రంగంలోకి దిగి కన్సార్షియంలోని కంపెనీలను దారిలోకి తేవటం మొదలెట్టింది. ప్రభుత్వాలు కూడా ఒత్తిడి తేవటంతో కన్సార్షియంలోని వివిధ దేశాల కంపెనీలు మొత్తానికి అమెరికా కంపెనీ సబ్‌కామ్‌కు మొగ్గు చూపాయి. ప్రాజెక్టు సబ్‌కామ్‌కే దక్కింది.