Begin typing your search above and press return to search.

చైనా తొలి విమానం ఎగిరింది.. మార్కెట్ లో మారనున్న సమీకరణాలు

By:  Tupaki Desk   |   29 May 2023 11:38 AM GMT
చైనా తొలి విమానం ఎగిరింది.. మార్కెట్ లో మారనున్న సమీకరణాలు
X
ప్రతి చోట తన సత్తా చాటాలని తపించే దేశాల్లో చైనా ముందుంటుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా మారాలన్న ప్రయత్నంలో భాగంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న చైనా.. రంగం ఏదైనా ఇతర దేశాల మీద ఆధారపడేందుకు అంతగా ఇష్టపడదు. తాజాగా విమానయాన రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. బోలెడంత ఆర్ అండ్ డీ అనంతరం.. చైనా తయారు చేసిన సొంత విమానం తొలిసారి ఎగిరింది. తన మొదటి వాణిజ్య కార్యకలాపాలను షురూ చేసింది. మొదటి ప్రయాణం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి మాంచి జోష్ లో ఉంది.

చైనా సొంతంగా తయారు చేసుకున్న ప్రయాణికుల విమానం సీ919 ఆదివారం విజయవంతంగా తన తొలి జర్నీని షాంఘై - బీజింగ్ మధ్య నడిపారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ సంస్థ ఈ విమానాన్ని నడిపింది.

రెండు ఇంజిన్లు ఉన్న ఈ విమాన సామర్థ్యం 164 సీట్లు కాగా.. తొలి ప్రయాణంలో 128 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2.25 గంటల వ్యవధిలో తన గమ్యస్థానానికి చేరుకున్న ఈ విమానానికి బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సేఫ్ గా ల్యాండ్ అయ్యాక సీ919 విమానానికి సిబ్బంది.. ప్రయాణికులకు వాటర్ సెల్యూట్ కార్యక్రమంలో స్వాగతం పలికారు.

అంతర్జాతీయ విమాన ప్రమాణాలతో పాటు సొంత మేధో సంపత్తి హక్కులతో చైనా సీ919 విమానాన్ని తయారు చేసుకుంది. ఇకసారి ఇంధనం నింపితే 5555 కి.మీ. దూరం వరకు ప్రయాణించేలా ఈ విమానాన్ని రూపొందించారు. వాణజ్య విమానాల తయారీలో పేరున్న బోయింగ్.. ఎయిర్ బస్ లతో పోటీ పడాలన్నది చైనా ప్లాన్ గా చెప్పాలి. తాజా ఎంట్రీతో అంతర్జాతీయ విమానాల్లో ఎక్కువగా వినియోగించే ఏ320, బీ737 విమానాలకు సీ 919 బలమైన పోటీదారుగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. తాజా పరిణామం అంతర్జాతీయంగా పలు సమీకరణాల్ని మారుస్తుందని చెప్పాలి.

విమానాల తయారీ సంస్థల్లో టాప్ 5 కంపెనీల్ని చూస్తే..

1. లాక్ హీడ్ మార్టిన్
2. ఎయిర్ బస్
3. బోయింగ్
4. రేథియాన్ టెక్నాలజీస్
5. నార్త్ రోప్ గ్రుమ్మన్

అయితే.. ఈ సంస్థల్లో బోయింగ్.. ఎయిర్ బస్ మాత్రమే వాణిజ్య విమానాల్నితయారుచేస్తాయి. మిగిలిన కంపెనీలు సైనిక విమానాల తయారీ మీదనే ఫోకస్ చేస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా టాప్ వాణిజ్య విమాన తయారీ సంస్థలుగా చూస్తే.. ఎయిర్ బస్.. బోయింగ్ నిలుస్తాయి. ఎయిర్ బస్ యూరోపియన్ కూటమికి చెందినదైతే.. బోయింగ్ అమెరికాకు చెందిన సంస్థ.

తాజాగా చైనా ఈ రంగంలో ఎంట్రీ ఇవ్వటం ద్వారా.. ఇప్పటికే రంగంలో ఉన్న అమెరికా.. యూరోపియన్ దేశాలకు పోటీదారుగా మారినట్లైంది. వస్తువు ఏదైనా.. చౌకధరలతో సేవలు అందించే విషయంలో చైనాకున్న పేరు ప్రఖ్యాతుల నేపథ్యంలో.. విమాన తయారీ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం ద్వారా.. అమెరికా.. యూరోపియన్ దేశాలకు కొత్త సవాలు విసిరినట్లు అవుతుంది.

అదే సమయంలో ప్రాశ్చాత్య దేశాల మీద ఆధారపడకుండా తనకు తాను సొంతంగా వాణిజ్య విమానాల్ని తయారు చేసుకోవటం వాణిజ్య పరంగా చాలా లెక్కల్ని ప్రభావితం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.