Begin typing your search above and press return to search.

అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన పిల్లలు… 40 రోజుల తర్వాత ?

By:  Tupaki Desk   |   10 Jun 2023 10:35 AM GMT
అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన పిల్లలు… 40 రోజుల తర్వాత ?
X
అమెజాన్ అడవుల్లో అద్భుతం జరిగింది. క్రూర మృగాలు తిరిగే ఈ అడవుల్లో నలుగురు పసివాళ్లు.. 40 రోజుల పాటు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. పండ్లు, ఆకులు అలుములు తింటూ 40 రోజుల పాటు... మృత్యువుతో యుద్ధం చేసి విజయం సాధించారు. 13 ఏళ్లు, 9 ఏళ్లు, నాలుగేళ్లు, ఒక ఏడాది వయస్సున్న నలుగురు చిన్నారులు.. ప్రపంచంలోనే దట్టమైన అరణ్యంగా పేరుగాంచిన అమెజాన్‌ అడవుల్లో ప్రాణాలను కాపాడుకున్నారు. కొలంబియా అధ్యక్షుడు చేసిన ఈ ప్రకటనతో.. ఆ దేశ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు.

అసలు ఏం జరిగిందంటే... మే 1వ తేదీన కొలంబియాలోని గౌవియారే ప్రాంతంలో దట్టమైన అమెజాన్‌ అటవీ ప్రాంతంలో ఓ విమానం కుప్పకూలిపోయింది. అందులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది నేల కూలబోతున్నట్లు పైలట్‌ ప్రకటించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాడార్ల పరిధి నుంచి ఆ విమానం వేరయింది.

ఈ ప్రమాదంలో చిన్నారుల తల్లి, పైలెట్‌, గైడ్‌ మరణించగా.. 13, 11, 9 ఏళ్ల చిన్నారులతో పాటు ఏడాది వయసున్న పసికందు ప్రాణాలతో బయటపడ్డారు. పెద్దవాళ్లందరూ మరణించడం వల్ల.. ఏడాది వయసున్న పాపను కాపాడుకుంటూ ఈ ముగ్గురు చిన్నారులు.. ఆ దండకారణ్యంలో పోరాటం ప్రారంభించారు. పండ్లు, ఆకులు అలుములూ తింటూ అడవి నుంచి బయటపడేందుకు నడవడం ప్రారంభించారు. కానీ దిక్కు దారి తెలియక రోజుల తరబడి అడవిలోనే తిరుగుతున్నారు.

విమాన ప్రమాద విషయం తెలుసుకున్న కొలంబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. నలుగురు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. రంగంలోకి దిగిన మూడు సైనిక హెలికాప్టర్లు అమెజాన్ అడవుల్లో శోధించాయి. 100 మందికి పైగా సైనికులు, స్నిఫ్ఫర్ డాగ్స్ సాయంతో అమెజాన్ అడవుల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మూడు మృతదేహాలను గుర్తించిన సైనికులు.. చిన్నారుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు.

రోజులు గడుస్తున్నా.. చిన్నారుల ఆచూకీ లభించలేదు. అలా 40 రోజులు గడిచిపోయాయి. ఇక చిన్నారులపై ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో.. సైనికులకు పసివాళ్లు కనిపించారు. 40 రోజులుగా అమెజాన్‌ అడవుల్లో తప్పిపోయిన చిన్నారులను సురక్షితంగా ఆస్పత్రికి తరలించామన్న కొలంబియా అధ్యక్షుడి ప్రకటనతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.